పింగళి సూరన్నకి పరాభవం

రామకృష్ణుడి తండ్రిగారు మరణించి చాలాకాలమైంది. రాయలవారి ఆస్థాన కవిగా ప్రసిద్ధులైన పింగళి సూరన్నగారు ఒకరోజు తెనాలి వచ్చారు. పూర్వపరిచయం కొద్దీ సూరన్నగారు ఆ యింట బస(ఉండటం ) చేశారు. సూరన్నగారు ముక్కోపి. అహంభావి. అంతటి గొప్ప కవి. తన చిన్నతనంలో తన తల్లిగారు మొక్కుకున్న మొక్కు తీర్చడం కోసం ‘తట్టెడు కొత్తబెల్లం’ పట్టుకొచ్చారు.

తెనాలి రామలింగేశ్వరస్వామివారికి తట్టెడు బెల్లంతో పానకం చేయించి నివేదిస్తానని ఆయన తల్లిగారు మొక్కుకుందట. అది తీర్చడానికి వచ్చారాయన.

రామకృష్ణుడి తల్లి లక్ష్మమ్మగారు తన కొడుకుని ఆయనముందు నిలబెట్టి “మావాడు అంతో యింతో కవిత్వం చెప్పగలడు బాబుగారూ! మీరు తల్చుకుంటే రాయల వారి ఆస్థానంలో వీడికి స్థానం కల్పించగలరు. ఆ సహాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబూ…” అని వేడుకుంది. పింగళి సూరన్నగారు రామకృష్ణుడిని యకసెక్కంగా ఎగాదిగా చూసి “వీడా…. వేలెడంతలేడు… యీ లింగడు కూడా కవిత్వం చెప్తాడా?” అని పరిహసించారు.

అంతలోనే తన మాటలకి ఆవిడ నొచ్చుకుందని గ్రహించి “సరేనమ్మా… స్నానానికి వెళ్లొచ్చాక మీ లింగడి కవిత్వం ఏపాటిదో పరీక్షిస్తాను. ఏమాత్రం డొక్కశుద్ధి వున్నా ఏదోసాయం చేస్తాలే” అనేసి స్నానసంధ్యల నిమిత్తం చెరువుకి వెళ్లిపోయారు. రామకృష్ణుడి కడుపు రగిలిపోయింది. చుట్టంచూపుగా యింటికొచ్చిన తననలా హేళన చేస్తాడా? ఆయనకి ఎలాగైనా తన తఢాఖా చూపాలనుకున్నాడు.

ముగించుకుని సూరన్నగారు తిరిగి వచ్చి చూసేసరికి తను తెచ్చిన బెల్లంబుట్ట కన్పించలేదు. ఆయన చిరాకుపడుతూ “ఏరా లింగా! రామలింగడికోసం తెచ్చిన బెల్లంబుట్ట ఏది?” అని అడిగారు. రామలింగడు ముసిముసిగా నవ్వుతూ “అదిగో… లింగార్పితం అయిపోతోంది” అంటూ వీధిలో బెల్లం ముక్కలు తింటున్న పిల్లల్ని చూపించాడు.

పూజారి హడావిడిగా వస్తూ “సూరన్నగారూ! పానకపు బెల్లం ఎక్కడ?” అని అడిగాడు. సూరన్న గారికి ఒళ్లు మండిపోయింది. తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ… “తెనాలి రామలింగడు తిన్నాడుర తట్టెడంత…” అనేశాడు ఆశువుగా. ఆపైన తన పద్యాన్ని ఎలా పూరించాలో ఆయనకి ఆ కోపంలో తట్టలేదు. అదే మంచిసమయం అనుకుని రామకృష్ణుడు దాన్ని ఆశువుగా పూరించాడు.

తెనాలి రామ లింగడు

తిన్నాడుర తట్టెడంత, తియ్యని బెల్లం

బెన్నగమన పింగళిసూ

రన్నకు నోరంతా పేడై పోయెనురా.

అంతే! ఆ పద్యం విన్న సూరన్నగారికి గొంతు పెగల్లేదు. ఆ తర్వాత మళ్లీ బెల్లం తెప్పించి మొక్కు చెల్లించుకుని వెళ్లిపోతూ “అమ్మా! పోట్లగిత్తలాంటి లింగడి ముక్కుకి తాడువెయ్యమ్మా. తనేదార్లో కొస్తాడు” అన్నాడు. ఆ మాటల్లోని నిష్ఠుర సత్యాన్ని గ్రహించిన లక్ష్మమ్మగారు తక్షణం పిల్లని వెతికి రామలింగడికి పెళ్లి చేసింది. అతని భార్య పేరు కమల.