పిసినారి


వరలక్ష్మి మహా పిసినారని ఆ వీధిలోనే కాదు ఆ గ్రామంలో అందరికీ తెలుసు. ఒకసారి చాకలికి బట్టలేసి పద్దు రాసుకునేందుకు పెన్ను అవసరమైంది. ప్రక్కింటి కమల కొడుకును అడిగి పెన్ను తీసుకురమ్మంది కూతురును లేదన్నారని ఉత్తినే వచ్చేసింది కూతురు. ఎదురింటి గీత, వనజ , సరళను అడిగిచూడమంది.'అమ్మా! అందరూ లేదన్నారే!" అని నిట్టూర్చింది. కూతురు.
"సర్లే! ఇవ్వకపోతే అవ్వకపోయారు. మీ నాన్న బట్టలు పెట్టుకునే బీరువాలో పెన్నుంది తీసుకురా" చెప్పింది వరలక్ష్మి.
ముందు ఆశ్చర్యపోయి చూసినా, తర్వాత వెతికి పట్టుకువచ్చి వస్తూ- "అవునమ్మా! నాకు తెలియక అడుగుతాను. మనింట్లోనే పెన్నూ పేపరు పెట్టుకుని ఇతరులను అడగటం దేనికి?" అనుమానంగా చూసింది కూతురు.

"ఎందుకా- ఏమిటి? ఇంకు అయిపోతే మనం కొనగలమా?" విసురుగా అంది తల్లి. అర్ధమైన దానిలా కూతురు తలూపేసరికి 'ఇదైనా మనం కొన్నదా ఏమిటి? ఎదురింటి పిల్లాడు ఇక్కడకు రాసుకోవటానికి వచ్చి మర్చిపోయిన పెన్ను" అని తల్లి చెప్పేసరికి మరోసారి నివ్వెరపోయి చూడాల్సి వచ్చింది తల్లిని.
తల్లి పిసినారితనానికి తలబాదుకుంది కూతురు.