పోతన పద్యాలు



1.తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా
యిల్లంబందున నుండి జ్రుంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
బిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భరతీ పూర్ణేందు బింబాననా.

అర్థం: ఓ దేవీ సరస్వతీ! నేను నిన్ను పూజిస్తూ పుస్తకమును చేతబూని ఉన్నాను. నీ శ్రీవాసము నుండి నాపై కరుణతో జ్వాలించు నీ మాధుర్యముతో నా వాక్కులోని సరస్వతీ దేవి, నీవు జగన్మోహినీ, పూర్ణ చంద్రుని వంటి ముఖము కలవానివి.

2.అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

అర్థం: అమ్మలలో గొప్పమ్మ, ముగ్గురమ్మలకు మూలపుటమ్మ, చాలా గొప్పమ్మ, సురారులను (అదే అంటే దుర్మార్గులను) కడుపారడి నాశనం చేసిన యమ్మ, లోకంలో నమ్మిన వాళ్లకు రక్షణ కలిగించే యమ్మ, మన సర్వములలో ఉండే యమ్మ, దుర్గామాత, కృపాబ్ధి (కరుణ సముద్రం) మా యమ్మ, నీ అనుగ్రహంతో మహత్వం, కవిత్వం, పటుత్వం (బలము) మరియు సంపదను ప్రసాదించే యమ్మ.

3.పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్ర ంబునన్
నెట్టం గల్గను గాళి గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీ
దెట్టే వెంట జరింతు దత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్
పట్టున్ మానకుమమ్మ నమ్మితిజుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ

అర్థం: తల్లీ! సరస్వతీ! నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను. రెల్లుపొదలో పుట్టిన కుమారస్వామిని కాను. నావలో పుట్టిన వ్యాసుడిని కాను. కాళీమాత అనుగ్రహం పొందిన కాళిదాసును కాను. (అంటే కవిత్వంలో వారికున్న ఘనత నాలో ఏ మాత్రం లేదు అని అర్థం). నేను భాగవత పురాణాన్ని రచించాలనుకుంటున్నాను.నాకు తగినంత శక్తిని ప్రసాదించమ్మా, ఓ దయగలతల్లీ! బ్రహ్మాణీ! అని భాగవత రచనకు ఉపక్రమించే సందర్భంలో బమ్మెర పోతన సరస్వతీ దేవిని స్తుతిస్తున్నాడు.

4.చేతులారంగ శివుని బూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబులోనుగా దలపడేని
గలుగనేటికి దల్లుల కడుపు చేటు

అర్థం: చేతులు జోడించి మనస్ఫూర్తిగా భక్తితో శివుడి (భగవంతుడు) ని పూజించనివాడు, నోరారా ఆ విష్ణుమూర్తి సద్గుణాలను భక్తితో గానం చేయనివాడు, ఇతరప్రాణుల పట్ల దయతో లేనివాడు, నిరంతర అసత్యం చెబుతూ సత్యవర్తనం ఆచరింపనివాడు… మానవ జన్మ ఎత్తి ఉపయోగం లేదు.

5.హరికిన్‌పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్

అర్థం: విష్ణుమూర్తికి పట్టపుదేవి, శ్రీదేవి, పుణ్యాలరాశి, సిరిసంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, సరస్వతిపార్వతులతో ఆడుకునే పూవు వంటి శరీరం కలది, తామరపూలలో నివసించేది, ముల్లోకాలలోనూ పూజలు అందుకునే పూజనీయురాలు, వెలుగు చూపులతో దారిద్య్రాన్ని తొలగించే తల్లియైన శ్రీమహాలక్ష్మి… మాకునిత్యకల్యాణాలను అనుగ్రహించుగాక.

6.కొందఱికి దెనుగు గుణమగు
గొందఱికి సంస్కృతంబు గుణమగు రెండున్
గొందఱికి గుణములగు నే
నందఱి మెప్పింతు గృతుల నయ్యెయ్యెడలన్

అర్థం: కొందరికి తెలుగు భాష అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరు సంస్కృతభాషను ఇష్టపడతారు. ఇంకా కొందరికి రెండు భాషల మీద మక్కువ ఉంటుంది. కాబట్టి, అందరూ మెచ్చుకునే విధంగా ఆయా సందర్భాలకు అనుగుణంగా నేను రెండు భాషలనూ ఉపయోగించి కావ్యరచన చేస్తాను.

7.లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజశ్రేయమై

అర్థం: ఈ భాగవత గ్రంథం… లలితమైనది. మనసుకు ఆనందాన్ని కలిగించేది. ఈ గ్రంథానికి శ్రీకృష్ణుడి చరిత్ర మూలం. శుకమహర్షిచే మనసుకు హత్తుకునేలా పాడబడిన అందమైన గానం. గనిలో నుంచి బంగారాన్ని శుభ్రం చేస్తే ఏ విధంగా మెరుస్తుందో అదే విధంగా మంచి మనసులు కలవారికి ఇది మంచి విజ్ఞానాన్ని కలిగించే గ్రంథం. అందమైన కథావస్తువుతో నిండిన గ్రంథం. ఈ గ్రంథం చదివిన వారికి, ఇందులోని కథలు విన్నవారికి మంచి ఫలితం లభిస్తుంది. స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యాసభగవానుడురచించిన ఈ భాగవత గ్రంథం కల్పవృక్షం వంటిది. అందరి క్షేమాన్ని కోరేది.

8.హారికి నందగోకుల విహారికి జక్ర సమీర దైత్య సం
హారికి భక్త దుఃఖ పరిహారికి గోప నితంబినీ మనో
హారికి దుష్ట సంపదపహారికి ఘోష కుటీ పయోఘృతా
హారికి బాలక గ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్

అర్థం: అందమైన, దివ్యమైన హారాలను ధరించినవాడు, నందగోకులంలో స్వేచ్ఛగా విహరించేవాడు, తృణావర్తుడు మొదలైన రాక్షసులను సంహరించినవాడు, భక్తుల కష్టాలను పరిహరించేవాడు (పోగొట్టేవాడు) పదహారువేల గోపికల మనసులను అపహరించినవాడు (మనసు దోచుకున్నవాడు) రాక్షసుల సంపదలనుకొల్లగొట్టినవాడు, గోకులంలోని గొల్లల ఇళ్ల నుంచి పాలు, నెయ్యి వంటివి అపహరించినవాడు, పసిపిల్లల పాలిట పెనుభూతంలా ఉన్న ‘పూతన’ అనే రాక్షసిని అంతం చేసినవాడు అయిన శ్రీకృష్ణునికి… తన కృతిని సమర్పిస్తున్నాను అని బమ్మెర పోతన వివరించాడు.

9.గురువులు ప్రియశిష్యులకున్
బరమరహస్యములు దెలియబలుకుదురచల
స్థిరకల్యాణంబెయ్యది
పురుషులకు నిశ్చయించి బోధింపు తగన్

అర్థం: సూతమునీ! గురువులు తమకు ప్రియమైన శిష్యులకు చదువుల సారాన్ని, అందులోని పరమ రహస్యాలను తెలియచెబుతారు. అదేవిధంగా శాశ్వతమైన శుభాలు దేనివలన కలుగుతాయో కూడా శిష్యులకు బోధిస్తారు.

10.భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు గల్యాణవి
శేషణములు హరిగుణోపచితభాషణముల్

అర్థం: విష్ణుమూర్తిని వర్ణిస్తూ, ఆయనలో ఉన్న సుగుణాలను కీర్తిస్తూ పలికే పలుకులు సరస్వతీదేవికి అలంకారం అవుతాయి. అంతేకాదు సకల పాపాలను పోగొడతాయి. మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మృత్యువును నివారిస్తాయి. శుభాలు కలుగచేస్తాయి.

11.భగవంతుండగు విష్ణుడు
జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్
దగ నవ్వేళల దయతో
యుగయుగమున బుట్టి కాచు నుద్యల్లీలన్

అర్థం: రాక్షసులు మానవులకు బాధలు కలిగిస్తారు. అలా సమస్త లోకాలలో ఎప్పుడు వారి వలన బాధలు కలుగుతాయో, అప్పుడు శ్రీమహావిష్ణువు అవతరిస్తాడు. అమితమైన కరుణతో ఆయా యుగాలలో అవతరించి, తన లీలలను చూపుతూ ప్రజలను కాపాడుతుంటాడు.

12.నిగమములు వేయి జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను
నిగమంబు బఠింప ముక్తినివసనము బుధా

అర్థం: వేదమంత్రాలు వేలకొలదీ చదివినా ముక్తిమార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేకపోవచ్చు. కాని వేదాలతో సమానమైన భాగవత గ్రంథాన్ని చదివితే చాలు, మోక్షానికి అదే నిలయం అవుతుంది.

13.భూసురుడవు బుద్ధిదయా
భాసురుడవు శుద్ధవీర భటసందోహా
గ్రేసరుడవు శిశుమారణ
మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ

అర్థం: ఓ అశ్వత్థామా! నువ్వు ద్రోణాచార్యుని కుమారుడివి. పుట్టుకతో బ్రాహ్మణోత్తముడివి. వివేకం, బుద్ధి, దయ, దాక్షిణ్యం వంటి మంచి గుణాలతో పేరు పొందవలసినవాడివి. వీరులందరిలో నువ్వు గొప్పవాడివి. అటువంటి నువ్వు రాక్షసులు మాత్రమే చేయగలిగిన పని చేశావు. నిద్రిస్తున్న పసిపిల్లలను హత్య చేశావు. ఇలాచేయడం ధర్మమేనా తండ్రీ! ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ, నిద్రిస్తున్న ఉపపాండవులను హతమార్చిన సందర్భంలో ద్రౌపది అశ్వత్థామతో అన్న మాటలివి.

14.మలయమున జందనముక్రియ
వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిలపై నభవుడు హరియదు
కులమున నుదయించె నండ్రు గొందఱనంతా!

అర్థం: ఓ అనంతా! చిరుగాలి వలన కలిగే ఆహ్లాదాన్ని, చందనం ఇనుమడింపచేయునట్లు, యుధిష్ఠిరుని కీర్తిని ఇంకా ప్రకాశింపచేయటం కోసం జన్మ అనేదే లేని శ్రీహరి యాదవ కులంలో అవతరించాడని కొందరు అంటారు.

15.రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సం
యోజకుడైన చక్రి యట యుగ్ర గదాధరుడైన భీముడ
య్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో!

అర్థం: ధర్మరాజు వంటి మహాత్ముడు రాజై ఉండగా, ఇంద్రుని కుమారుడైన అర్జునుడు తన చేతిలో ధనుస్సు ధరించి ఉండగా, శత్రువులను సంహరించే గాండివము విల్లయి ఉండగా, అందరినీ రక్షించే శ్రీకృష్ణుడే వీరి పక్షాన రథసారథియై ఉండగా, భయంకరమైన గదను ఆయుధంగా ధరించిన భీముడే ఆ ధర్మరాజుకి తోడుగాఉండగా… పాండవులకు ఈ విధంగా వరుసపెట్టి కష్టాలు కలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాలమహిమ కాకపోతే ఈ విధంగా జరుగుతుందా! పాండవుల కష్టాలను చూసి భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడిన సందర్భంలోని పద్యం.

16.త్రిగజన్మోహన నీలకాంతి తనువుద్దీపింప బ్రాభాత నీ
రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవిందమతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాడు మదినావేశించునెల్లప్పుడున్.

అర్థం: ముల్లోకాలను మోహింపచేయగల శ్యామసుందరుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కనిపించే ఎరుపురంగులా ఉన్న ఉత్తరీయాన్ని ధరించినవాడు, అందమైన జుట్టు మధ్య ప్రకాశించే అరవిందం వంటి ముఖం కలవాడు, మా అర్జునుడికి తోడునీడగా ఉన్నవాడు అయిన శ్రీకృష్ణుడు నా మదిలో నిరంతం నివసించిఉండుగాక! ఇది భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించిన సందర్భంలోని పద్యం.

17.హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతిం జాల నొ
చ్చియు బోరించు మహానుభావు మదిలో జింతింతు నశ్రాంతమున్

అర్థం: యుద్ధరంగం మీద రథాలు, గుర్రాల మూపురాల నుంచి ఎగిరి వచ్చిన దుమ్ము, ధూళితోను, శ్రమించటం వలన కలిగిన చెమటబిందువులతోనూ మెరుస్తున్న ముఖంతో, నాచే విడువబడిన శస్త్రాల దెబ్బలు బాధిస్తున్నప్పటికీ, అర్జునునికి విజయం కలిగించాలనే వేడుకతో యుద్ధం చేయించే శ్రీకృష్ణునికి నేనునమస్కరిస్తున్నాను.

18.కుప్పించి యెగసిన గుండలంబులకాంతి గగనభాగం బెల్ల గప్పికొనగ
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదల
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మఱల దిగువ
గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువుమర్జున! యనుచు మద్విశిఖవృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

అర్థం: ఊపిరి బిగపట్టి రథం మీదనుంచి ఒక్కసారిగా ఎగిరిన శ్రీకృష్ణుని చెవుల కుండలాలకు ఉన్న కాంతులు ఆకాశమంతా వ్యాపించాయి. అతని కడుపులో ఉన్న లోకాలన్నీ ఒక్కసారిగా కదిలి, అలజడి చెందాయి. ఆయన భుజం మీద వేలాడుతున్న పీతాంబరం కిందకు జారిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి వేగంగా మీదకువెడుతుండగా, ‘‘నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నువ్వు నవ్వులపాలు చేయకు కృష్ణా’’ అని అర్జునుడు బతిమాలుతుంటే, ‘‘నన్ను అడ్డగించకు. ఈరోజు భీష్ముడిని చంపి, నిన్ను రక్షిస్తాను’’ అంటూ ఏనుగు మీదకు లంఘించే సింహంలాగ, నా బాణాలను తప్పించుకుని నా మీదకు ఉరుకుతూ వచ్చే ఆ కృష్ణుడే దిక్కునాకు’’ అన్నాడు భీష్ముడు.

19.ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొక్కడై తోచు పో
లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూ
పకుడై యొప్పుచునుండునట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై

అర్థం: ఒకే సూర్యుడు, సమస్త జీవులకు వేర్వేరుగా ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్లు కనిపిస్తాడు. ఏ దేవుడు తన అద్భుతమైన లీలలతో, తన నుండి పుట్టిన జీవసమూహాల మనస్సులలో అనేక రూపాలలో ఉంటాడో, అటువంటి దేవుడైన శ్రీకృష్ణుడిని, నేను మంచిమనసుతో ప్రార్థిస్తాను. (అని భీష్ముడు పలికాడు)

20.తండ్రులకెల్ల దండ్రియగు ధాతకు దండ్రివి దేవ నీవు మా
తండ్రివి తల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండవుం
దండ్రులు నీ క్రియం బ్రజల ధన్యులజేసిరె? వేల్పులైన నో
తండ్రి! భవన్ముఖాంబుజము ధన్యత గానరు మా విధంబునన్

అర్థం: ఓ దేవా! తండ్రులందరికీ తండ్రి అయిన వాడు బ్రహ్మదేవుడు. అటువంటి ఆయనకే నీవు తండ్రివి. మాకు మాత్రం తల్లి, తండ్రి, పతి, దైవం, సఖుడు, గురుడవు… సర్వం నువ్వే. ఏ తండ్రులైనా నీలాగ ప్రజలను ధన్యులుగా చేశారా! దేవతలు సైతం మాలాగే నీ ముఖారవిందాన్ని చూసి ధన్యులయ్యే భాగ్యాన్ని పొందలేరుకదా!

21.ఏ దినమున వైకుంఠుడు
మేదినిపై దాల్చినట్టి మేను విడిచె నా
డా దినమున నశుభ ప్రతి
పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెన్

అర్థం: మహారాజు అయిన పరిక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పాడు, ‘ఓ రాజా! భూమి మీద అవతరించిన శరీరాన్ని వైకుంఠుడు అయిన శ్రీకృష్ణుడు ఏ రోజున విడిచిపెట్టాడో, సమస్త అశుభాలను తీసుకు వచ్చే కలియుగం ఆ రోజే ప్రారంభం అయ్యింది.

22.చూడుడు నా కల్యాణము
పాడుడు గోవిందు మీది పాటలు దయతో
నాడుడు హరిభక్తుల కథ
లేడహములలోన ముక్తి కేగగ నిచటన్.

అర్థం: ఓ మహనీయులారా! నాకు మంచి జరగాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. దయతో మీరంతా గోవిందుని మీది గీతాలను గానం చేయండి. శ్రీహరి భక్తులకు సంబంధించిన చరిత్రలను నాకు వివరించండి. నేను ఇక్కడే ఉండి, ఏడు రోజులలో ముక్తిని పొందే మార్గాన్ని బోధించండి. అని పరిక్షిత్తు కోరాడు.

23.హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే

అర్థం: ఓ రాజా! ఈ ప్రపంచం అంతా విష్ణుమూర్తితో నిండి ఉంది. శ్రీహరి ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీహరి లేని వస్తువు అనేది అణువంత కూడా ఈ ప్రపంచంలో ఉండదు. విన్నావా కౌరవవంశంలో జన్మించిన మహాత్మా! అని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో విష్ణుమూర్తి గురించివివరించాడు.

24.క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
రశ్రేణికి జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక ర మ్య పాణికిన్

అర్థం: నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించునామెకు, బ్రహ్మదేవుని మనసు వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మము, పుస్తకము చేతుల ధరించువాణికి, సరస్వతీదేవికి, నా నుదురు నేలను తాకునట్లు వంగి, భక్తితో నమస్కరించెదను.

25."అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."

అర్థం: అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెఱ్ఱివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మవద్దు" అని చిన్నికృష్ణుడు. మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి, నోరు తెరిచి చూపించబోతున్నాడు.

26.అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

అర్థం: ఈ పద్యం వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఆయన వైకుంఠలో ఉన్న సౌందర్యాన్ని, లక్ష్మీదేవితో ఆయన యొక్క దివ్యత్వాన్ని, మరియు భక్తుల బాధలను తొలగించే కాపాడే స్వభావాన్ని వర్ణిస్తుంది.

27.ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.

అర్థం: విశ్వంలో ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, విష్ణువు (చక్రి) ప్రతి చోట ఉంటాడు. అతని ఉనికిని అన్వేషించడానికి అవసరం లేదు, ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడు.

28.ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

అర్థం: ఈ పద్యంలో కవి భగవంతుని సర్వవ్యాప్తి, సృష్టి, స్థితి, లయాల మూలకారణం అనే విషయాలను ప్రశ్నల రూపంలో పొందుపరిచాడు. ఈ ప్రశ్నలతో భగవంతుని మహిమను, సర్వత్రా ఉనికి, మరియు అతని శరణాగతి యొక్క ముఖ్యతను వివరిస్తున్నాడు.

29.నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"

అర్థం: సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”

30."మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

అర్థం: ఆమె సర్వమంగళ కదా మరి, అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకకల్యాణంతో అందరికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగమని పరమ శివునికి చెప్పింది.

31."లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

అర్థం: ఈపోతన పద్యం తెలియని తెలుగువాడు ఉండడు.అలాంటి మహాద్భుత ప్రార్థన. చిన్నతనంలో అందరూ కంఠతా పట్టి, మాటిమాటికీ చదువుకునే పద్యం. దేవా! నాలో శక్తి కొంచెం కూడా లేదు. ధైర్యం సడలి పోయింది.ప్రాణాలు కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప ఇతరులెవ్వరు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!

32.శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

అర్థం: శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.

33.సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

అర్థం: విష్ణుమూర్తి భక్తరక్షణలో ఎంత గట్టిగా ఉంటాడో చూడండి. ఈ పద్యానికి ఒక కథ. పోతన బావ శ్రీనాథుడు ఈ పద్యం విని, ‘ఏ పరికరాలు లేకుండా అంతటి దేవుడు పరిగెట్టాడని ఎలా వ్రాసావు? అని వెక్కిరించాడట. తరువాత వారిద్దరూ భోజనాలు చేస్తుంటే, పోతన కొడుకు, నూతిలో పెద్దరాయి పడేసి, ‘మామా నీ కొడుకు...’ అని అరిచాడట. ఎంగిలి చేత్తో పరిగెట్టుకొచ్చాడు శ్రీనాధుడు. ‘బావా! తాడైనా లేకుండా ఎందుకు వచ్చావు కాపాడటానికి?’ అన్నాడట పోతన. గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దు కోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

34.అన్నావు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన సేయుటో మధుర
మంజుల భాషల నాదరించుటో మిన్నుల మ్రోతలే నిజాము మేలని చంపకుమన్న మాని రా
వన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్.

అర్థం: “అన్నవు, నీవు చెల్లెలికి అందించిన చీరలు, శుభాకాంక్షలు, మధుర భాషలో ముద్దుగా మాట్లాడటం అన్నీ మంచి పనులు. కానీ నిజంగా, మిస్సు అయ్యేది కాదని తెలియజేస్తూ, అన్నం, ప్రేమతోనే మంచిగా ఉండమని కోరుకుంటున్నాను.”

35.ఆదౌదేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం
మాయాపూతనజీవితాపహరణం, గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన కురవాదిహననం కౌంతేయసంరక్షణం
ఎతద్భాగవతం పురాణకథితం, శ్రీకృష్ణ లీలామృతం!

అర్థం: ఆదౌదేవకీదేవి గర్భజననం - మొదటగా, దేవకీ అనే గాయిని గర్భధారణం ద్వారా శ్రీకృష్ణుడి జననం, అంటే కృష్ణుడు దేవదేవుడిగా పుట్టాడు. గోపీ గృహే వర్ధనం - కృష్ణుడు తన బాల్య కాలంలో గోపీ కుటుంబంలో పెరిగాడు, మరియు వాటిని సంరక్షించినది. మాయాపూతనజీవితాపహరణం - కృష్ణుడు మాయానికితి అయిన పాపాలను మరియు అజ్ఞాన జీవనాన్ని దూరం చేసాడు. గోవర్ధనోద్ధారణం - గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించటం ద్వారా కృష్ణుడు తన భక్తులను కాపాడాడు. కంసచ్ఛేదన - కంస అనే దుర్మార్గ రాజుని సంహరించాడు. కురవాదిహననం - కురవ దుర్మార్గులను సమూల నాశనం చేసినాడు. కౌంతేయసంరక్షణం - అర్జునుడిని, తన సహచర భక్తులను రక్షించాడు. ఎతద్భాగవతం పురాణకథితం - ఈ అన్ని ఘట్టాలు భగవద్గీత వంటి పురాణాలలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ లీలామృతం - ఈ కథలు, కృష్ణుడి లీలలు, మానవ జీవితానికి అమృతం. ఈ శ్లోకం శ్రీకృష్ణుడి వివిధ అద్భుతమైన స్మృతులను, అతని జీవితం లో చేసిన ముఖ్యమైన కార్యాలను పాడుతుంది.

36.రవిబింబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతమై గళాభారణమై, సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటియై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు తాబ్రహ్మన్డమున్ నిండుచోన్.

అర్థం: సూర్యుడి ప్రతిబింబంలా, సౌగంధి, శ్రేయోభిలాషి.తలపై ఉండే ఆభరణం ఒక చక్రంలా, దివ్య ముత్యంతో అలంకరించబడింది. చెవుల్లో ముత్యాల అందమైన ఆభరణాలు. కంఠంలో ప్రాచీన రీతిలో అలంకరణ. చేతులపై సువర్ణ కేయూరాలు. చేతులపై ముత్యాల కంకణాలు. కటిస్థలంలో ముత్యాల నూపురాలు. పాదాలు అందంగా అలంకరించబడి, వారి పాదపీఠం గొప్పగా. ఈ అందమైన ఆభరణాలను ధరించేవాడు ఒక మహానుభావుడు లేదా దైవాత్మ

37.భిల్లీ భల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ
ఝిల్లి హరి శరభ కరి కిటిమల్లాద్భుత కాక ఘూక మయమగు నడవిన్

అర్థం: మగ, ఆడ భిల్లులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, గురుపోతులు, కొండముచ్చులు, చమరీ మృగాలు, ఈల పురుగులు, సింహాలు, శరభమృగాలు, ఏనుగులు శ్రేష్ఠమైన పందులతోను, ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు, గుడ్లగూబలతో ఆ అడవి నిండిఉంది. అటువంటి అడవిలో...

38.తలగవు కొండలకైనను
మలగవు సింగములకైన మార్కొను కడిమిం
గలగవు పిడుగులకైనను
నిల బలసంపన్నవృత్తి నేనుగు గున్నల్

అర్థం: గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి. అందువల్ల అవి పెద్దపెద్ద కొండలను, సింహాలను సైతం లెక్కచేయవు. వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్న కారణంగా అవి ఏ జంతువు ఎదురువచ్చినా పక్కకు తప్పుకోవు. అడవంతా నిర్భయంగా, స్వేచ్ఛగా సంచరిస్తాయి.

39.తుండంబుల బూరించుచు
గండంబుల జల్లుకొనుచు గళగళరవముల్
మెండుకొని వలుద కడుపులు
నిండన్ వేదండకోటి నీరుంద్రావెన్

అర్థం: ఏనుగులు తొండాల నిండుగా నీటిని తీసుకొని పైన చల్లుకొంటూ, చెంపల మీద చల్లుకొంటూ గడగడ ధ్వనులు చేస్తూ తమ పెద్ద కడుపులు నిండేలాగ నీళ్లు తాగాయి.

40.కరిదిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భరమనుచును నతల కుతల భటులదిరిపడన్

అర్థం: ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రానురాను ఏనుగుకి మొసలి భారమైంది. మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో అంటే భూలోకానికి కింద ఉన్న రెండు నివసిస్తున్నవీరులు ఈ రెండిటినీ చూసి ఇవి రెండూ ఒకదానిని మించినవి మరొకటి అని భయపడసాగారు.

41.ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

అర్థం: ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి, పెరిగి, లీనమవుతోందో! ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూలకారణమైన ప్రభువు అయి ఉన్నాడో! ఎవడు ఆదిమధ్యాంతాలు మూడూ తానై ఉన్నాడో! ఎవడు తనకు తాను పుట్టినవాడో! ఈ ప్రపంచానికంతటికీ అటువంటిప్రభువైనవానిని శరణు కోరుతున్నాను.

42.కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలం
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో!

అర్థం: భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు. ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు. అన్నిదిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా?

43.ఒకపరి జగముల వెలినిడి
యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై
సకలార్థసాక్షియగు న
య్యకలంకుని నాత్మమయుని నర్థి దలంతున్

అర్థం: ఒకసారి లోకాలను బయట ఉంచుతూ, మరొకసారి తన లోపల ఉంచుకుంటూ అంటే ప్రపంచాన్ని చూపటం, అంతలోనే దానిని మాయం చే యటం ఈ రెండూ తానే అయ్యి, ప్రపంచంలో జరిగే వాటన్నింటికీ తానే సాక్షి అవుతూ ఉన్న దోషరహితుడు, ఆత్మమయుడుఅయినవానిని ఆర్తితో కొలుస్తాను.

44.లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్

అర్థం: లోకాలు, లోకాధిపతులు, లోకులు నశించిన తరవాత, లోకమనేది లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమపురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను. లోకంబులు అంటే పద్నాలుగు లోకాలు. లోకేశులు అంటే వాటినిపరిపాలించేరాజులు. లోకస్థులు అంటే ఆ లోకంలో ఉండే చరాచరజీవులు. తెగిన అంటే నశించిన. తుదిన్ అంటే కడపట లేదా యుగాంతంలో వచ్చే ప్రళయకాలంలో. అలోకంబగు అంటే లోకములు లేనిదైన. పెంజీకటికి అంటే గాఢాంధకారానికి అవ్వలన్ అంటే అవతల. ఎవ్వండు ఏకాకృతిన్ అంటే ఒకే ఆకారంతో ఎవరైతే వెలుగున్ అంటే ప్రకాశిస్తాడో అతనిని. నే సేవింతున్ అంటే నేను కొలుస్తాను.

45.లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెన ు మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

అర్థం: శారీరకబలం, మనోబలం రెండూ క్షీణించాయి. ప్రాణాలు కడముట్టాయి. శరీరం అలసిపోయింది. నువ్వు తప్ప నాకు మరో దైవం తెలియదు. నన్ను దయతో ఆదరించు. ఈ దీనుడిని కాపాడు. నువ్వు వరాలిస్తావు. మంచిని కలిగించే మనసు కలవాడవు కదా స్వామీ!

46.వినుదట జీవుల మాటలు
చనుదట చనరాని చోట్ల శరణార్థుల కో
యనుదట పిలిచిన సర్వము
గనుదట సందేహమయ్యె గరుణావార్థీ!

అర్థం: ఓ కృపాసముద్రుడా! నీవు అంతటా వ్యాపించి ఉండి, అన్ని జీవుల మాటలను వినగలవట. విన్నవెంటనే వెళ్లలేని ప్రదేశాలకు సైతం వెళ్లగలవట. ఆపదలో ఉండి శరణు కావాలని నిన్ను ఆర్తితో పిలిచినంతనే వారిని ఆదుకుంటావట. నీకు అన్ని విషయాలూ తెలుసట. శరణు కావాలని కోరిన నన్ను రక్షించటానికి నీవు ఇంతవరకు రాలేదు. అందువల్ల నిన్ను గురించి నాకు తెలిసిన విషయాలనన్నిటినీ సందేహించవలసి వస్తోంది.

47.న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్

అర్థం: శరణుకోరిన వారిని తక్షణమే రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు. ఆయన గజరాజు పిలుపు విని త్వరత్వరగా బయలుదేరాడు. ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరింది. ఆమె వెంట అంతఃపురంలోని స్త్రీలంతా బయలుదేరారు. వారి వెంట గరుత్మంతుడు, ఆయన వెంటధనుస్సు, శంఖ చక్రాలు, గద మొదలయిన దివ్యాయుధాలు బయలుదేరాయి. వాటివెంట నారదమహర్షి, ఆ వెనుకే విష్వక్సేనుడు బయలుదేరారు. మొత్తానికి వైకుంఠంలోని సమస్త దేవతలు కదలి వచ్చారు.

48.అడిగెదనని కడువడి జను
నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్
వడివడి జిడిముడి తడబడ
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్

అర్థం: తన భర్త అయిన విష్ణుమూర్తి హడావుడిగా ఎక్కడికి వెళుతున్నాడోఅర్థం కాలేదు లక్ష్మీదేవికి. ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో త్వరత్వరగా ఆయన వెంట పరుగె త్తింది. ఆ తొందరలో విషయం ఏమిటని అడిగినా ఆయన బదులు చెప్పడని ఠక్కునఆగిపోతుంది. అంతలోనే కలవరపడుతూ ముందుకు అడుగు పెట్టింది. మళ్లీ అంతలోనే ఏ విషయమూ సరిగా చెప్పడనే భావనతో కదలకమెదలక నిలబడిపోయింది.

49.మకరమొకటి రవి జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున డాగెన్
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్

అర్థం: మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ దృశ్యాన్ని చూసి... ఆ భయానకమైన సుదర్శన చక్రం తన పైకి వస్తుందేమోనని భయపడి రాశులలో ఒకటయిన మకరం సూర్యుని వెనుక చేరింది. నిధులలో ఒక రకమయినమకరం కుబేరుని శరణు కోరి, ఆయన వెనుక దాక్కుంది. సముద్రంలో ఉన్న మొసళ్లన్నీ ఆదికూర్మం అయిన తాబేలు కిందకు దూరిపోయాయి.

50.కరమున మెల్లన నివురుచు
గర మనురాగమునమొరసి కలయంబడుచున్
గరి హరికతమున బ్రతుకుచు
గరపీడన మాచరించె గరిణులు మఱలన్

అర్థం: విష్ణుమూర్తి అనుగ్రహంతో మొసలి బారి నుంచి బయట పడింది గజరాజు. ఆడ యేనుగులన్నీ ఆనందంతో గజరాజు చుట్టూ తిరిగాయి. తమతమ తొండాలతో గజరాజును పెనవేసుకుని, ఇన్ని రోజులుగా దాచుకున్న ప్రేమను వ్యక్తం చేశాయి.

51.గజరాజ మోక్షణంబును
నిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్
గజరాజ వరదుడిచ్చును
గజ తురగ స్యందనములు గైవల్యంబున్

అర్థం: పరీక్షిన్మహారాజా! ఈ గజేంద్రమోక్షం ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో చదివినవారికి ఈ లోకంలో సంపద, బంగారం, వస్తువులు, సకల వాహనాలు వంటి సమస్త సుఖాలు కలుగుతాయి. ఆ తరవాత శ్రీమహావిష్ణువు మోక్షాన్ని తప్పక ప్రసాదిస్తాడు.

52.అక్షీణోగ్ర తపంబు మందరముపై నర్థించి మా తండ్రి శు
ద్ధక్షాంతిం జని యుండఁ జీమగమిచేతన్ భోగి చందంబునన్
భక్షింపంబడెఁ బూర్వపాపములచేఁ బాపాత్మకుం డంచు మున్
రక్షస్సంఘముమీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై.

అర్థం: “పూర్వం మా తండ్రి ఘోరమైన తపస్సు చేయటానికి మందరపర్వతము మీదికి ప్రశాంత చిత్తంతో వెళ్ళాడు. చాలాకాలం రాకుండా అక్కడే ఉన్నాడు. దేవత లందఱు “ఇక హిరణ్యకశిపుడు చీమల బారిన పడిన పాము లాగ తన పాపాలచే తానే నాశన మయ్యాడు.” అని అందరు కలిసి రాక్షసులపైకి యుద్ధానికి సంసిద్ధులు అయి బయలుదేరారు

53.ప్రస్థానోచిత భేరిభాంకృతులతోఁ బాకారియుం దారు శౌ
ర్యస్థైర్యంబుల నేగుదెంచినఁ దదీయాటోప విభ్రాంతులై
స్వస్థేమల్ దిగనాడి పుత్ర ధన యోషా మిత్ర సంపత్కళా
ప్రస్థానంబులు డించి పాఱి రసురుల్ ప్రాణావనోద్యుక్తులై.

అర్థం: జైత్రయాత్రకు తగిన సన్నాహంతో యుద్ధభేరీలు మ్రోగాయి. ఇంద్రుడు దేవతలూ యుద్ధోత్సాహంతో ఆవేశంతో దండు వెడలి వచ్చి పడ్డారు. రాక్షసులు అందరూ ఆ ధాటికి తట్టుకోలేక తమ భార్యాబిడ్డలను, బంధుమిత్రులనూ, ధనధాన్యాలనూ విడిచి అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని పారిపోయారు.

54.ప్రల్లదంబున వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం
గొల్లబెట్టి సమస్త విత్తముఁ గ్రూరతం గొని పోవఁగా
నిల్లు చొచ్చి విశంకుఁడై యమరేశ్వరుం డదలించి మా
తల్లిఁ దాఁ జెఱఁబట్టె సిగ్గునఁ దప్తయై విలపింపఁగాన్.

అర్థం: దండెత్తి వచ్చిన దేవతలు దౌర్జన్యంతో రాక్షసరాజు నివాస మందిరాన్ని వెంటనే ఆక్రమించారు. సర్వ సంపదలూ, ధనాగారం సమస్తం దోచేశారు. దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలోకి చొరబడ్డాడు. మా తల్లిని చెరబట్టాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడింది. దేవేంద్రుడు ఆమె ఎంత ఏడ్చినా వినిపించుకోలేదు

55."స్వర్భువనాధినాథ! సురసత్తమ! వేల్పులలోన మిక్కిలిన్
నిర్భరపుణ్యమూర్తివి సునీతివి మానినిఁ బట్ట నేల? యీ
గర్భిణి నాతురన్ విడువు కల్మషమానసురాలు గాదు నీ
దుర్భరరోషమున్ నిలుపు దుర్జయుఁ డైన నిలింపవైరి పై."

అర్థం: “ఓ దేవేంద్రా! నువ్వేమో దేవతలలో శ్రేష్ఠుడివి; పుణ్యమూర్తివి; నీతిమంతుడవు; స్వర్గ లోకానికే అధిపతివి; ఇలా నువ్వు పరస్త్రీని పట్టుకుని రావటం తప్పు కదా; ఈమె పాపాత్మురాలు కాదు; పైగా ఈమె గర్భవతి; నీ కోపం ఏం ఉన్నా హిరణ్యకశిపుడి మీద చూపించు. అంతేకాని ఈమె పై కాదు. వెంటనే భయార్తురాలు అయిన ఈమెను విడిచిపెట్టు.”

56."అంతనిధాన మైన దితిజాధిపువీర్యము దీని కుక్షి న
త్యంత సమృద్ధి నొందెడి మహాత్మక! కావునఁ దత్ప్రసూతి ప
ర్యంతము బద్ధఁ జేసి జనితార్భకు వజ్రము ధారఁ ద్రుంచి ని
శ్చింతుఁడనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజవల్లభన్.

అర్థం: “ఓ మహాత్ముడా! లోకాలకు దుస్సహమైన హిరణ్యకశిపుని రాక్షస వీర్యం ఈమె కడుపులో వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఈమె ప్రసవించే వరకు బందీగా ఉంచి, పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో సంహరిస్తాను. అప్పుడు నా మనస్సు నిశ్చింతగా ఉంటుంది. ఈ రాక్షసరాజు పత్నిని చివరికి విడిచిపెట్టేస్తాను.”

57."నిర్భీతుండు ప్రశస్త భాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా
విర్భూతాచ్యుతపాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా
గర్భస్థుం డగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్
దుర్భావంబునఁ బొంది చావఁడు భవద్దోర్దండ విభ్రాంతుఁ డై."

అర్థం: “దానవేంద్రుడు హిరణ్యకశిపుని భార్య కడుపులో పెరుగుతున్న వాడు భయం అన్నది లేని వాడు. మహా భక్తుడు. పరమ భాగవతోత్తముడు. అతనికి ఎవరూ శత్రువులు కారు. అతను జన్మజన్మల నుంచీ హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్న మహా మహిమాన్వితుడు. కాబట్టి ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా, నీ బాహుపరాక్రమం అతని మీద ఏమాత్రం పనిచేయదు, అతనిని చంపలేవు కనీసం ఏ విధమైన కష్టం కలిగించలేవు.”

58.యోషారత్నము నాథదైవత విశాలోద్యోగ మా తల్లి ని
ర్వైషమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోష యై
యీషద్భీతియు లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు
శ్రూషల్ చేయుచు నుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్.

అర్థం: మహిళారత్నము, మహా పతివ్రతా, సుసంకల్ప అయిన మా అమ్మ లీలావతి, ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోకుండా, భర్తనే దైవంగా భావిస్తూ, అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. తన కడుపులో పెరుగుతున్న కుమారుని క్షేమం కోరుకుంటూ, నారదమహర్షికి సేవలు చేస్తూ, ఏ బెదురు లేకుండా, మేలైన నడతతో ఆశ్రమంలో ఉండిపోయింది.

59.వెల్లిగొని నాఁటనుండియు
నుల్లసితం బైన దైవయోగంబున శో
భిల్లెడు మునిమత మంతయు
నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁ డైనన్.

అర్థం: నారదమహర్షికి నా మీద ఉన్న దయవలన, దైవయోగం కలిసిరావటంవలన, నాకు మాత్రం వారి యొక్క ఆ ఉపదేశాలు అన్నీ పుట్టిననాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు కూడ ఒక్కటి కూడ నేను మర్చిపోలేదు. చక్కగా అన్నీ గుర్తున్నాయి.”

60.వినుఁడు నాదు పలుకు విశ్వసించితిరేని
సతుల కయిన బాల జనుల కయినఁ
దెలియ వచ్చు మేలు దేహాద్యహంకార
దళననిపుణ మైన తపసిమతము."

అర్థం: శ్రద్దగా వినండి చెప్తాను. నా మాట నమ్మండి. నారద మహర్షి తత్వం తెలుసుకోడానికి స్త్రీలు, బాలలు కూడ అర్హులే. ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు, మమకారాలు తొలగిపోతాయి. ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది.”

61.కడఁగి త్రిగుణాత్మకము లైన కర్మములకు
జనకమై వచ్చు నజ్ఞాన సముదయమును
ఘనతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి
కర్మవిరహితు లై హరిఁ గనుట మేలు.

అర్థం: “పిల్లలు! ఈ సంసారం కేవలం బుద్ధి వలననే ఏర్పడుతుంది. ఇది సత్త్వ రజస్తమో గుణాత్మకాలు అయిన కర్మలలో బందీ అయి ఉంటుంది; ఈ సంసారం అన్నది కేవలం స్వప్నం లాంటిది. ఎంతమాత్రం యదార్థం కాదు. సకల కాంక్షలు మనస్సులోనే పుడతాయి. స్వప్నం, మెలకువ ఈ రెండింటికి తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా, గుణాలను ఆశ్రయించి ఆయన కూడ జననం, మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాలు వలన ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో కాల్చివేయాలి. అలా కర్మ బంధాల నుండి విముక్తులై విష్ణుమూర్తిని కనుగొనటం మంచిది.

62.మరులు కొని యుండుఁ; దనలోన మాటలాడు;
వేల్పు సోఁకిన పురుషుని వృత్తి దిరుగు;
బంధములఁ బాసి యజ్ఞానపటలిఁ గాల్చి
విష్ణుఁ బ్రాపించుఁ; దుది భక్తి వివశుఁ డగుచు.

అర్థం: భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని భక్తుడైనవాడు పొంగిపోతాడు. సుగుణాలు విని పులకరించి పోతాడు. భక్తి పారవశ్యంతో కళ్ళలో ఆనందభాష్పాలు ఒలుకుతుండగా గద్గద కంఠంతో “కమలాక్షా! వైకుంఠా! వరదా! నారాయణా! వాసుదేవా!” అని గొంతెత్తి పాడతాడు. ఆడతాడు. అరుస్తాడు. నవ్వుతాడు. ఇంకా నమస్కరిస్తాడు. ఎప్పుడు ఆ దేవుడిమీద మోహం కలిగి ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. అంతే కాదు దయ్యం పట్టినట్లు తిరుగుతాడు. ఇట్లు భక్తి తత్పరుడు అయి ఉండి, చివరకు కర్మబంధాలను విడిచి, అజ్ఞానం తొలగించుకుని, భక్తి వివశుడై, విష్ణువు నందు ఐక్యం అవుతాడు.

63.చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!

అర్థం: భగవంతుడు గాఢ మైన భక్తికి వశమై నట్లు; నోములు, యాగాలు, దానాలు, శుచిత్వాలు, మంచి నడవడికలు, తపస్సులు, యుక్తులు లాంటివి వాటికి వేటికీ వశము కాడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం. భక్తి వినా వేరు మార్గం లేనే లేదు. దిగజారిపోవడమే లేనట్టి ఉన్నతతమ శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందా మన్నా, బిగించే కొద్దీ వేళ్ళ మధ్యనుండి జారిపోయే నీళ్ళలా జారి పోతుంటాడు. భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు.

64.చాలదు భూదేవత్వము
చాలదు దేవత్వ మధిక శాంతత్వంబుం
జాలదు హరి మెప్పింప వి
శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్.

అర్థం: మంచి శ్రద్ధ గల బాలకులారా! విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు, బ్రాహ్మణత్వం సరిపోదు, దైవత్వం సరిపోదు, గొప్ప శాంత స్వభావమూ చాలదు. విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం.

65.దనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర
సుందరీ విహంగ శూద్ర శబరు
లైనఁ బాపజీవు లైన ముక్తికిఁ బోదు
రఖిల జగము విష్ణుఁ డనుచుఁ దలఁచి.

అర్థం: దనుజులు, రాక్షసులు, నాగులు, యక్షులు, దైత్యులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, శూద్రులు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాపజీవనులు అయినా సరే “సర్వం విష్ణుమయం జగత్” అని మనసారా తలచినట్లైతే చాలు, ముక్తిని పొందుతారు.

66.గురువులు దమకును లోఁబడు
తెరువులు చెప్పెదరు విష్ణు దివ్యపదవికిం
దెరువులు చెప్పరు; చీఁకటిఁ
బరువులు పెట్టంగ నేల? బాలకులారా!

అర్థం: బాలలూ! మీ అమాయకత్వం వదలండి. మన ఉపాధ్యాయులు వారికి తెలిసిన చదువులే చెప్పగలరు; చెప్తున్నారు. అంతే కాని దివ్యమైన శ్రీహరి సాన్నిధ్యం పొందటానికి అవసరమైన మార్గాలు చెప్పరు. మనం ఈ గుడ్డి చదువులు చదివి వారి వెంట అజ్ఞానం అనే చీకటిలో పరుగెత్తటం దేనికి? చెప్పండి.

67.తెం డెల్ల పుస్తకంబులు
నిం డాచార్యులకు మరల నేకతమునకున్
రండు విశేషము చెప్పెదఁ
బొం డొల్లనివారు కర్మపుంజము పాలై.

అర్థం: ఆ పుస్తకాలు అన్నీ తెచ్చి గురువులకు ఇచ్చేసి రండి. మళ్ళీ మనం ఏకాంతంగా కూర్చుందాం. ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను. ఇష్టంలేనివాళ్ళు వెళ్ళండి. మీ కర్మలు మీరు అనుభవించండి.

68.ఆడుదము మనము హరిరతిఁ
బాడుద మే ప్రొద్దు విష్ణుభద్రయశంబుల్
వీడుదము దనుజసంగతిఁ
గూడుదము ముకుందభక్తకోటిన్ సూటిన్.

అర్థం: మనం శ్రీహరి మీది చిత్తముతో ఆడుకుందాం రండి. మాధవుడిని మనసు నిండా నింపుకుని హరిసంకీర్తనలు పాడుకుందాం. మిగిలిన రాక్షసుల స్నేహం విడిచిపెడదాం. నిర్భయంగా విష్ణుభక్తులతో చేరిపోదాం రండి.

69.విత్తము సంసృతిపటలము
వ్రత్తము కామాదివైరివర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభ మగు మనకున్."

అర్థం: ఈ సంసారం అనే మాయా బంధాన్ని తొలగించుకుందాం. అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తం శ్రీహరికి సమర్పిద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పక శుభం కలుగుతుంది."

70."రక్షో బాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా
శిక్షామార్గము లెల్ల గల్ల లని యాక్షేపించి తా నందఱన్
మోక్షాయత్తులఁ జేసినాఁడు మనకున్ మోసంబు వాటిల్లె; నీ
దక్షత్వంబునఁ జక్కఁజేయవలయున్ దైతేయవంశాగ్రణీ!

అర్థం: “ఓ దైత్య కుల శిరోమణి! హిరణ్యకశిప మహారాజా! నీ కుమారుడు రాక్షస కుమారులను అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకు వెళ్లి, నేను చెప్పే చదువులు అన్నీ బూటకములు అని ఆక్షేపించాడు. రాక్షస విద్యార్థులకు అందరికి మోక్షమార్గం బోధిస్తున్నాడు. మనకు తీరని ద్రోహం చేస్తున్నాడు. మరి నీవు ఏం చేస్తావో! చూడు. నీ కొడుకు దుడుకుతనం మితిమీరిపోతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇక వాడిని చక్కబెట్టటానికి నీ సామర్థ్యం వాడాల్సిందే.

71."ఉల్లసిత విష్ణుకథనము
లెల్లప్పుడు మాఁకు జెప్పఁ"డీ గురుఁ డని న
న్నుల్లంఘించి కుమారకు
లొల్లరు చదువంగ దానవోత్తమ! వింటే.

అర్థం: ఓ దానవశ్రేష్ఠుడా! వింటున్నావు కదా! శిష్యులు “ఈ గురువు మనకు మనోహరమైన మాధవుని కథలు చెప్పడు” అని అనుకుంటూ, నన్నూ నా మాటలు లెక్కచేయటం మానేశారు. నేను చెప్పే చదువులు చదవటం మానేశారు. ఇదీ పరిస్థితి

72.ఉడుగఁడు మధురిపుకథనము
విడివడి జడుపగిదిఁ దిరుగు వికసనమున నే
నొడివిన నొడువులు నొడువఁడు
దుడుకనిఁ జదివింప మాకు దుర్లభ మధిపా!

అర్థం: మహారాజా! నీ కొడుకు ప్రహ్లాదుడు ఎవరు ఎన్ని చెప్పినా మధు దానవుని పాలిటి శత్రువు అయిన ఆ విష్ణువు గురించి చెప్పటం మానడు. ఎప్పుడూ మందమతిలా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు. చెప్పిన మాట విననే వినడు. ఇలాంటి దుడుకు వాడిని చదివించటం మా వల్ల కాదు.

73.చొక్కపు రక్కసికులమున
వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్."

అర్థం: స్వచ్ఛమైన రాక్షస వంశంలో వికృతమైనవాడు పుట్టాడు. ఎంత చెప్పిన విష్ణువుమీద మమత వదలడు. ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా హిరణ్యకశిపమహారాజ!

74.సూనున్ శాంతగుణ ప్రధాను నతి సంశుద్ధాంచిత జ్ఞాను న
జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమానున్ సదా
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద నా
ధీనున్ ధిక్కరణంబుజేసి పలికెన్ దేవాహితుం డుగ్రతన్.

అర్థం: ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి, గొప్ప గుణవంతుడూ; బహు పరిశుద్ధమైన జ్ఞానం అనే సంపదకు గనిలాంటి వాడు; అజ్ఞానం అనే అరణ్యానికి అగ్నిలాంటివాడు; నిరంతరం చేతులు జోడించి మనసులో పరంధాముని పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండేవాడు; అటువంటి సకల సద్గుణ సంశీలుడిని కన్న కొడుకును ధిక్కరించి, కోపించి; విబుధవిరోధి యైన హిరణ్యకశిపుడు ఇలా విరుచుకుపడ్డాడు.

75.నింద్రుఁ డౌదల నా మ్రోల నెత్త వెఱచు;
నమర కిన్నర గంధర్వ యక్ష విహగ
నాగ విద్యాధరావళి నాకు వెఱచు;
నేల వెఱువవు పలువ! నీ కేది దిక్కు.

అర్థం: "ఓ దుష్టుడా! నా ఆజ్ఞ లేకుండా ఆకాశంలో ఆదిత్యుడు కూడా గట్టిగా ప్రకాశించడానికి బెదురుతాడు; వాయువు కూడా అన్ని కాలాలలోనూ అనుకూలంగానే వీస్తాడు తప్పించి అహితుడుగా వీచటానికి భయపడతాడు; అగ్నిహోత్రుడు కూడా దేదీప్యమానమైన నా ప్రతాపం ముందు మందంగా వెలుగుతాడు తప్పించి, ఇష్టానుసారం చెలరేగి మండటానికి భయపడతాడు; పాపులను శిక్షించే యముడు కూడా బహు తీక్షణమైన నా ఆజ్ఞను కాదని ప్రాణుల ప్రాణాలు తీయటానికి వెరుస్తాడు; ఇంద్రుడికి కూడా నా ముందు తల యెత్తే ధైర్యం లేదు; దేవతలైనా, కిన్నరులైనా, యక్షులైనా, పక్షులైనా, నాగులైనా, గంధర్వులైనా, విద్యాధరులైనా, నేనంటే భయపడి పారిపోవలసిందే; అలాంటిది నువ్వు ఇంత కూడా లేవు. నేనంటే నీకు భయం ఎందుకు లేదు? ఇక్కడ నీకు దిక్కు ఎవరు? ఎవరి అండ చూసుకుని ఇంత మిడిసిపడి పోతున్నావు?

76.ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్ధ్వేషు లయ్యున్ మదీ
యాజ్ఞాభంగము చేయ నోడుదురు రోషాపాంగదృష్టిన్ వివే
క జ్ఞానచ్యుత మై జగత్త్రితయముం గంపించు నీ విట్టిచో
నాజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి? సాహంకారతన్ దుర్మతీ!

అర్థం: దుర్బుద్ధీ! మహా ప్రతాపవంతులు అయిన దిక్పాలకులు, నా మీద ఎంత ద్వేషం పెంచుకుంటున్నా కూడా, నా మాట జవదాటటానికి బెదురుతారు; నేను కోపంతో కడకంట చూసానంటే చాలు, ముల్లోకాలూ వివేక, విజ్ఞానాలు కోల్పోయి అల్లకల్లోలం అవుతాయి; అలాంటిది, అహంకారంతో నువ్వు నా ఆజ్ఞను ఎలా ధిక్కరిస్తున్నావు?

77.కంఠక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై
కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో
త్కంఠాబంధురుఁ డేని నే నమరులన్ ఖండింప దండింపఁగా
గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవక్షోణికిన్.

అర్థం: అర్భకా! వైకుంఠనాథుడైన విష్ణువుపై విజయం వీలుకాదు అంటూ గొంతు చించుకుని గట్టిగా తెగ అరుస్తున్నావు కానీ, అతనికే పౌరుషం వీరత్వం ఉంటే, నేను యుద్ధరంగంలో దేవతలను ఖండించేటప్పుడూ, దండించేటప్పుడూ భయపడకుండా వాళ్ళను రక్షించడానికి, నా ముందుకు రావాలి కదా?

78.ఆచార్యోక్తము గాక బాలురకు మోక్షాసక్తిఁ బుట్టించి నీ
వాచాలత్వముఁ జూపి విష్ణు నహితున్ వర్ణించి మ ద్దైత్య వం
శాచారంబులు నీఱు చేసితివి మూఢాత్ముం గులద్రోహి నిన్
నీచుం జంపుట మేలు చంపి కులమున్ నిర్దోషముం జేసెదన్.

అర్థం: ఆచార్యులు చెప్పింది నువ్వు వినటంలేదు. పైగా నీ తోటి విద్యార్థులకు కైవల్యం మీద కాంక్ష పుట్టిస్తున్నావు; నీ వాచాలత్వం చూపించి మన విరోధి విష్ణువును విపరీతంగా పిచ్చిమాటలతో పొగడుతున్నావు; మన రాక్షస వంశ సంప్రదాయాలు అన్నీ బూడిదపాలు చేశావు; నువ్వు కులద్రోహివి; మూఢుడివి; నీచుడివి; నీవంటి వాడిని చంపడమే మంచిపని. నిన్ను చంపి నా వంశానికి మచ్చరాకుండా చేస్తాను.

79.దిక్కులు గెలిచితి నన్నియు
దిక్కెవ్వఁడు? రోరి! నీకు దేవేంద్రాదుల్
దిక్కుల రాజులు వేఱొక
దిక్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్."

అర్థం: ఓరీ! అన్ని దిక్కుల చివర్ల వరకూ ఉన్న రాజ్యాలన్నీ గెలిచాను. దేవేంద్రాది దిక్పాలుకులు అందరూ ఏ దిక్కూలేక ఇప్పుడు నన్నే దిక్కని తలచి మ్రొక్కుతున్నారు. ఇక నన్ను కాదని నీకు రక్షగా వచ్చేవాడు ఎవడూ లేడని తెలుసుకో.

80.బలవంతుఁడ నే జగముల
బలములతోఁ జనక వీరభావమున మహా
బలుల జయించితి నెవ్వని
బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై."

అర్థం: బాలకా! ప్రహ్లాద! లోకా లన్నిటిలో నేనే అందరి కన్నా బలవంతుణ్ణి; సేనా సహాయం ఏం లేకుండానే ఒంటరిగా వెళ్ళి ఎందరో బలశాలుల్ని గెలిచిన శూరుణ్ణి; అలాంటి నాకు సాటి రాగల వీరుడిలా, ఎవరి అండ చూసుకొని, ఎదురు తిరుగుతున్నావు."

81.బలయుతులకు దుర్భలులకు
బల మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
బల మెవ్వఁడు ప్రాణులకును
బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!

అర్థం: హిరణ్యకశిప రాక్షసరాజ! బలవంతులకు, బలహీనులకు, నీకు, నాకు, బ్రహ్మ మున్నగు వారికి, సృష్ణిలోని సర్వ ప్రాణులకు అందరికి శరణు అయిన వాడు ఎవరో ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు. అందానికి పెట్టిందిపేరు ఈ పద్యం. ప్రహ్లాదుడు సరిగా చదువుకోటంలేదని హిరణ్యకశిపుడు దండిస్తుంటే బెదరటం లేదు. నా దండన నుంచి నిన్ను కాపాడగలిగే దిక్కెవరు అన్న తండ్రికి కొడుకు వినయంగా సమాధానం చెప్తున్నాడు. పంచాబ్దముల వాని పంచదార పలుకులతో సహజత్వం ఉట్టిపడేలా కళ్ళకు కట్టినట్లు ఎంతో చక్కగా నాటకీయత పండించారు మన సహజ కవి పోతనులవారు.

82.దిక్కులు కాలముతో నే
దిక్కున లేకుండుఁ గలుగుఁ దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి
దిక్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా!

అర్థం: ఈ పద్యం భగవంతుడిని సర్వసమర్థుడిగా వర్ణిస్తుంది. కాలం, దిక్కులు ఎలా మారిపోతున్నా, భగవంతుడు ఎప్పటికీ స్థిరంగా ఉన్న సర్వవ్యాపి. దిక్కులేని వారికి ఆయనే దిక్కుగా ఉంటారు. ఈ సృష్టిలో ఏదైనా దిక్కు లేదా సహాయం లేకపోయినప్పుడు, భగవంతుడు మాత్రమే సురక్షితమైన ఆధారం.

83.వైరు లెవ్వరు చిత్తంబు వైరి గాఁక?
చిత్తమును నీకు వశముగాఁ జేయవయ్య!
మదయుతాసురభావంబు మానవయ్య!
యయ్య! నీ మ్రోల మేలాడరయ్య! జనులు.

అర్థం: నాన్నగారూ! ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ ప్రభువు విష్ణుమూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. అతడు సుగుణాలకు నిధి. తన సత్తువ, బలం, పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్నిసృష్టిస్తూ, పోషిస్తూ, లయం చేస్తూ ఉంటాడు. ఆయన అవ్యయుడు. అన్ని రూపాలలోనూ అతడు ఉంటాడు. తండ్రీ! మనస్సుకు సమదృష్టి అలవరచుకో. ధర్మమార్గం తప్పిన మనస్సు కంటె పరమ శత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో అంతేకాని నువ్వే చిత్తానికి “చిత్తం, చిత్తం” అంటూ దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితం చెప్పటం లేదు. అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు తప్ప హితమైనది చెప్పటం లేదు.

84.లోకము లన్నియున్ గడియలోన జయించినవాఁడ వింద్రియా
నీకముఁ జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁ జేయు నీ
భీకర శత్రు లార్వురఁ బ్రభిన్నులఁ జేయుము ప్రాణికోటిలో
నీకు విరోధి లేఁ డొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!

అర్థం: నువ్వేమో, రాక్షసరాజా! లోకాలు అన్నింటినీ క్షణంలో జయించావు; కానీ నీ లోని మనస్సునూ, ఇంద్రియాలనూ గెలువలేకపోయావు; వాటి ముందు నువ్వు ఓడిపోయావు; కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు నిన్ను బందీ చేశారు; ఆ భయంకరమైన శత్రువులను అరిషడ్వర్గాలు అంటారు; వాటిని జయించి నశింపజేసావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. నా విన్నపం మన్నించు.

85.పాలింపుము శేముషి ను
న్మూలింపుము కర్మబంధముల సమదృష్టిం
జాలింపుము సంసారముఁ
గీలింపుము హృదయ మందుఁ గేశవభక్తిన్."

అర్థం: మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు; కర్మ బంధాలను త్రెంచివెయ్యి; భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరచుకో; నిరంతంరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యి.”

86.చంపినఁ జచ్చెద ననుచును
గంపింపక యోరి! పలువ! కఠినోక్తుల నన్
గుంపించెదు చావునకుం
దెంపరి యై వదరువాని తెఱఁగునఁ గుమతీ!

అర్థం: “దుర్మతీ! చావుకు తెగించావు. చంపుతారని కానీ, చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా కర్ణకఠోరమైన మాటలనే ఈటెలను నా మీదకే విసురుతున్నావు. చావును కూడా లెక్కచేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు.

87.నాతోడం బ్రతిభాష లాడెదు జగన్నాథుండ నా కంటె నీ
భూతశ్రేణికి రాజు లేఁ డొకఁడు; సంపూర్ణ ప్రభావుండు మ
ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితిం బల్మాఱు నారాయణుం
డే తద్విశ్వములోన లేఁడు; మఱి వాఁ డెందుండురా? దుర్మతీ!

అర్థం: ఓ దుర్భుద్ధీ! నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ జగత్తు అంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వం అంతా గాలించాను. కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు.

88.ఎక్కడఁ గలఁ డే క్రియ నే
చక్కటి వర్తించు నెట్టి జాడను వచ్చుం
జక్కడఁతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్."

అర్థం: విష్ణువును సేవకుడిలా తెగపొగడుతున్నావు. అసలు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతు ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? ఊఁ చెప్పు. లేకపోతే నిన్నూ, నీ హరిని సంహరిస్తాను. ముందు సమాధానం చెప్పు”

89."కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.

అర్థం: నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!

90.హరి సర్వాకృతులం గలం"డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై "యెందును లేఁడు లేఁ"డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్.

అర్థం: ఈ విధంగా ప్రహ్లాదుడు "భగవంతుడు సర్వ నామ రూపధారులందు అంతట ఉన్నాడు."అని చెప్తుంటే, హిరణ్యకశిపుడు "ఎక్కడా లేడు"అంటూ బెదిరిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మహా మహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వ చరాచరము లన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు. భక్తాగ్రేసర కృషీవలుడు అందించిన మధుర మైన పంటలలో ముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర. భక్తుల సామర్థ్యాలు ఎలా ఉంటాయో, భక్తుల ప్రపత్తికి అతను ఎంత బలంగా స్పందిస్తాడో, అతని సర్వ వ్యాపకతా శీలం, అచ్యుత శీలం ఎలాంటివో నిరూపించే ప్రహ్లాద చరిత్రలో కథ చాలా బలమైంది, కవిత్వం మిక్కిలి ఉన్నత మైంది, సాహిత్యం ఉత్కృష్ట మైంది, విలువలు అపార మైనవి. కథానాయకుడు కొడుకు ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు – ప్ర (విశిష్ట మైన) హ్లాదుడు (ఆనందము కల వాడు), విష్ణుభక్తుడు} పరమ భక్తుడు సాత్వికుడు ఓర్పు శ్రద్ధలకు మారు పేరు. ప్రతినాయకుడు తండ్రి హిరణ్యకశిపుడు {హిరణ్యకశిపుడు – హిరణ్యము (బంగారము, అగ్నిదేవుని సప్త జిహ్వలలో ఒకటి) కశిపుడు (పరపు, విరివి కల వాడు), దానవుడు} పరమ బలాఢ్యు డైన రాక్షసుడు తమోగుణ పరాకాష్ఠ. మరి కథలో బలానికి లోటే ముంటుంది. చదివించిరి, దిక్కులు గెలిచితి, కల డంభోధి, ఇందు గల డందు లాంటి పద్యాలలోని కవిత్వ సాహిత్య సౌరభాలే కదా వాటిని పండిత జనసామాన్య నాలుకలపై నానేలా చేసినవి. ఎన్ని కష్టా లెదురైనా చెక్కు చెదరని భక్తుల ప్రపత్తి నిబద్ధతతో కూడిన భక్తుల విలువలు. నారసింహ తత్వపు భక్తుని ఎడ భగవంతుడు చూపే అత్యద్భుత మైన వాత్యల్య విలువలు తిరుగు లేనివి. ఎంతటి భయంకర మైన పరిస్థితులలో ఉన్నా ఈ పద్యం మననం చేస్తు ఉంటే ఎట్టి పరిస్థితులలో మేలే తప్ప కీడు జరగదు అన్నది జగద్వితమే. ఓం నరసింహ వషట్కారాయః నమః

91."డింభక సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు ననుచు మిగుల సం
రంభంబునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁ గలవె చక్రిన్ గిక్రిన్!

అర్థం: ఓరి డింభకా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి.

92.స్తంభమునఁ జూపవేనిం
గుంభిని నీ శిరముఁ ద్రుంచి కూల్పఁగ రక్షా
రంభమున వచ్చి హరి వి
స్రంభంబున నడ్డపడఁగ శక్తుం డగునే."

అర్థం: నువ్వు చెప్పినట్లు ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే, ఎలాగూ నీ తల త్రెంచి నేల మీద పడేస్తాను కదా. అప్పుడు నిన్ను కాపాడటానికి విష్ణువు రాగలడా? అడ్డు పడగలడా?”

93."అంభోజాసనుఁ డాదిగాఁగ దృణపర్యంతంబు విశ్వాత్ముఁడై
సంభావంబున నుండు ప్రోడ విపులస్తంభంబునం దుండడే?
స్తంభాంతర్గతుఁ డయ్యు నుండుటకు నే సందేహమున్ లేదు ని
ర్దంభత్వంబున నేఁడు గానఁబడు బ్రత్యక్షస్వరూపంబునన్."

అర్థం: “ఆ విశ్వాత్ముడు విష్ణువు బ్రహ్మ దగ్గర నుండి గడ్డిపరక దాకా సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నాడు. అటువంటప్పుడు, ఇంత పెద్ద స్తంభంలో ఎందుకు ఉండడు? ఈ స్తంభంలో పరంధాముడు ఉన్నాడు అనటంలో ఎటువంటి అనుమానమూ లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా”

94.వినరా డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం
డని భాషించెద; వైన నిందుఁ గలఁడే" యంచున్ మదోద్రేకియై
దనుజేంద్రుం డరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభా శుంభమున్
జనదృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్.

అర్థం: “ఒరే! వినరా! మూర్ఖా! అర్భకా! ఎంతో గొప్పగా విష్ణువు విశ్వాత్మకుడు అంటున్నావు. అయితే దీంట్లో ఉన్నాడా?” అంటూ మదోన్మత్తుడు అయి; ఆవేశంతో ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు అరచేతితో; జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి,భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి, శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి; ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు.

95.ఏ దినమున వైకుంకుడు
మేదినిపై దాల్టినట్టి మేను విడిచె నా
డా దినమున నశుభ ప్రతి
పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెస్

అర్థం: మహారాజు అయిన పరిక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పాడు. 'ఓ రాజా! భూమి మీద అవతరించిన శరీరాన్ని వైకుంఠుడు అయిన శ్రీకృష్ణుడు ఏ రోజున విడిచిపెట్టాడో. సమస్త అశుభాలను తీసుకు వచ్చే కలియుగం ఆ రోజే ప్రారంభం అయ్యింది.

96.హరికిన్పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్

అర్థం: విష్ణుమూర్తికి పట్టపుదేవి, శ్రీదేవి, పుణ్యాలరాశి, సిరిసంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, సరస్వతిపార్వతులతో ఆడుకునే పూవు వంటి శరీరం కలది, తామరపూలలో నివసించేది, ముల్లోకాలలోనూ • పూజలు అందుకునే పూజనీయురాలు, వెలుగు చూపులతోదారిద్ర్యాన్ని తొలగించే తల్లియైన శ్రీమహాలక్ష్మి... మాకు నిత్యకల్యాణాలను అనుగ్రహించుగాక.

97.శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోనిధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!

అర్థం: తల్లీ! భారతీ! తెల్లవి కాంతులు వెల్లివిరిసే శరన్మేఘకదంబమూ, శారదచంద్ర బింబమూ, పచ్చకర్పూరమూ, పటీరమూ, రాజహంసలూ, జాజిచెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా, రెల్లుపూలూ, ఆదిశేషుడూ, మల్లెలూ, మందారాలూ, పాలసముద్రమూ, పూచిన పుండరీకాలు, ఆకాశగంగా - ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్జ్వలమైన ఉపమానాలు, అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుదీరా ఎన్నడు దర్శింపగలుగుతానో గదా!

98.పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట,
నేఁ బలికిన భవహర మగునఁట,
పలికెద, వేదొండు గాథ బలుకఁగ నేలా?

అర్థం: ఆహా! ఏమి నా అదృష్టం. పలికేది పరమపవిత్రమైన భాగవతమా! పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడా! పలికి నందువల్ల భవబంధాలు పరిహారమౌతాయా! అటువంటప్పుడు వృథాగా మరో కథ పలకడం దేనికి? భాగవతమే పలుకుతాను.

99.రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్రసం
యోజకుడైన చక్రి యట యుగ్ర గదాధరుడైన భీముడ
య్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో!

అర్థం: ధర్మరాజు వంటి మహాత్ముడు రాజై ఉండగా, ఇంద్రుని కుమారుడైన అర్జునుడు తన చేతిలో ధనుస్సు ధరించి ఉండగా, శత్రువులను సంహరించే గాండివము విల్లయి ఉండగా, అందరినీ రక్షించే శ్రీకృష్ణుడే వీరి పక్షాన రథసారథియై ఉండగా, భయంకరమైన గదనుఆయుధంగా ధరించిన భీముడే ఆ ధర్మరాజుకి తోడుగా ఉండగా... పాండవులకు ఈ విధంగా వరుసపెట్టి కష్టాలు కలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాలమహిమ కాకపోతే ఈ విధంగా జరుగుతుందా!

100.మగువా! విను సుఖహేతుక
మగు నర్థము దొరకమికి మహాదుఃఖమునం
దగులుదు రిది యంతయు నా
భగవంతుని యాజ్ఞఁజేసి ప్రాణులు మఱియున్.

అర్థం: అమ్మా! విను. దేనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకకపోవడం వల్ల జనులు దుఃఖాలపాలు అవుతున్నారు. ఇదంతా భగవంతుని ఆజ్ఞానుసారం జరుగుతూ ఉంటుంది. ఇంకా.

101.సద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి
యసురరాజ తనయు నందు నిలిచి
పాసి చనవు విష్ణుఁ బాయని విధమున
నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ!

అర్థం: నిర్మలమైన మనసు గల ధర్మరాజా! ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి.

102.పగవారైన సురేంద్రులున్ సభలలోఁ బ్రహ్లాద సంకాశులన్
సుగుణోపేతుల నెందు నే మెఱుఁగ మంచున్వృత్తబంధంబులం
బొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ! మీబోఁటి స
ద్భగవద్భక్తులు దైత్యరాజ తనయుం బాటించి కీర్తింపరే?

అర్థం: ఓ నరేంద్రా! రాక్షసకులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం, “ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు” అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇక మీలాంటి భాగవతోత్తములు అతనిని పొగడకుండా ఉంటారా?

103.గుణనిధి యగు ప్రహ్లాదుని
గుణము లనేకములు గలవు గురుకాలమునన్
గణుతింప నశక్యంబులు
ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.

అర్థం: ఆ సుగుణాలగని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్ప నలవికాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించినా ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగువారు కూడ వర్ణించలేరు.

104.పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!

అర్థం: రాజా! ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు.

105."పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్
మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే
శత్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం
బుత్రున్లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో?

అర్థం: “నారదమహర్షీ! లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసినవాళ్ళైనా తెలియనివాళ్ళైనా రక్షిస్తూ ఉంటారు. తెలియకపోతే బుద్ధిచెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు వినం కూడా. అలాంటిది బహు సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు? అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది.

106.బాలుఁబ్రభావిశాలు హరిపాదపయోరుహ చింతనక్రియా
లోలుఁగృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల
శ్రీలుసమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా
జాలున దేల? తండ్రి వడిఁ జంపఁగఁ బంపె మునీంద్ర! చెప్పవే.

అర్థం: నారదా! ప్రహ్లాదుడు చిన్నపిల్లాడూ, (కుఱ్ఱాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు, కనుక మన్నించటం న్యాయం అంతే తప్ప దండించడం తగదు) తేజోవంతుడూ, విష్ణుభక్తి గలవాడూ, సాధువుల గురువుల సేవ చేసేవాడూ, మంగళ స్వభావము కలవాడూ, సాధువులు పొగిడే ప్రవర్తన కల వాడూ, మోహపాశాలను త్రెంపుకున్న వాడూ. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి.” అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.

107.లభ్యంబైన సురాధిరాజపదమున్ లక్షింపఁ డశ్రాంతమున్
సభ్యత్వంబున నున్నవాఁ డబలుఁడై జాడ్యంబుతో వీఁడు వి
ద్యాభ్యాసంబునఁ గాని తీవ్రమతి గాఁ డంచున్ విచారించి దై
త్యేభ్యుండొక్క దినంబునం బ్రియసుతున్ వీక్షించి సోత్కంఠుఁడై.

అర్థం: “హిరణ్యకశిపుడు తన కొడుకు నడవడి చూసి “వీడు దేవేంద్ర పదవి దొరికినా లెక్కచేయడు. ఎప్పుడు చూసినా సోమరిలా అవివేకంతో తిరుగుతున్నాడు. బలహీను డయి జాడ్యంతో చెడిపోవుచున్నాడు. వీడిని చదువులు చదివిస్తే కాని చురుకైనవాడు కా” డని తలచి, ఒకరోజు కొడుకును చూసి ఉత్కంఠ కలవాడై.

108.చదువనివాఁ డజ్ఞుం డగు
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!"

అర్థం: ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి “బాబూ! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచిచెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండ చదువుకోవాలి. కనుక నిన్ను మంచిగురువుల దగ్గర చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా!.

109.“అంధప్రక్రియ నున్నవాఁడు, పలుకం డస్మత్ప్రతాపక్రియా
గంధంబించుక లేదు, మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనో
బంధుల్మాన్యులు మాకుఁ బెద్దలు, మముం బాటించి యీబాలకున్
గ్రంథంబుల్ చదివించి నీతికుశలుం గావించి రక్షింపరే.”

అర్థం: “అయ్యా! మా అబ్బాయి అజ్ఞానంతో అంధుడిలా ఉన్నాడు. ఏదడిగినా పలుకడు. నా పరాక్రమాలు, ఘనకార్యాలు వాసన మాత్రంగా నైనా వీనికి రాలేదు. మీరు మాకు అన్ని విధాల గురువులు, పెద్దలు, పూజ్యులు. మీరు దయామయ స్వభావము గలవారు, ఆత్మ బంధువులు. మ మ్మనుగ్రహంచి యీ చిన్నవాడికి చదువు చెప్పి పండితుడిని చేసి నన్ను కృతార్థుడిని చేయండి.” అని హిరణ్యకశిపుడు చదువు చెప్పే బాధ్యత అప్పజెప్పాడు.

110.అంచితభక్తితోడ దనుజాధిపు గేహసమీపముం బ్రవే
శించిసురారి రాజసుతుఁ జేకొని శుక్రకుమారకుల్ పఠిం
పించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రము లా కుమారుఁ డా
లించిపఠించె నన్నియుఁ జలింపని వైష్ణవభక్తి పూర్ణుఁడై.

అర్థం: ఇలా చండమార్కులు శ్రద్ధగా ఆ రాక్షసరాజు ఇంటికి పోయి ప్రహ్లాదుడిని పిలుచుకొని వచ్చి, అతనికి నేర్పాల్సిన సమస్త శాస్త్రాలు చదివించారు. అతడు కూడా విష్ణుభక్తిని మాత్రము వీడకుండా వారు చెప్పిన ఆ విద్యలన్నీ చదివాడు.