ప్రతాపసేనుని రాజభక్తి



ప్రతాపుడు చాల ఆనందించెను. అతనికి పన్నెడేండ్ల కుమారుడు ఉండెను. అతనిని బలిచేసి ప్రభువును రక్షించుకొనవలెనని నిశ్చయించుకొని వెంటనే గృహంనకు వెళ్ళెను.ప్రతాపసేనుని భార్యకూడ సతిగుణములకు తీసిపోవునది కాదు.

ప్రతాపుడు గుడినుండి వచ్చి, తన గృహంలోనికి పోవుట, నగర పాలకులగు గూఢచారులు గమనించిరి. గృహంనకుగల కిటికీలనుండి చూచిరి. లోపల ప్రతాపుడు భార్యతో గుసగుసలాడటం. మధ్య మధ్యన "మహారాజు" శబ్దం రావడంవల్ల, వారికి అనుమానం కలిగింది. వారిలో ఒకడు మహారాజునకు ఆ విషయం తెల్పుటకు వెళ్ళాడు. ఇంకొకడు ముందు ఏమి జరుగునో చూచుటకు ఆ ప్రాంతమందే దాగుకొని యున్నాడు.

లోనికిపోయిన ప్రతాపుడు జరిగినసంగతి అంతయూ భార్యకు తెలియ ఇప్పుడు మనం ప్రభువును రక్షించుకోవాలి. మన పుత్రునికంటే ." దేశమునకు మహారాజు ముఖ్యము" కావున మన పుత్రున్ని దేవికి కానుకగా యిద్దాము: ప్రభువును కాపాడుకుందాము" అని పలికెను.

భర్త మాటలకు ఆమె మనస్సులో కుమారునికై బాధపడెను. కానీ, ఆ బాధ పైకి కనబడనీయక "అంతకంటె మనకు కావలసినదేమున్నది? అలానే చేయుదము. రాజు బాగుండిన రాజ్యం బాగుపడును" అని సమ్మతించెను. ప్రతాపుడు ఆమె మాటలకు మిక్కిలి ఆనందించెను.

ఆ దంపతులు వెంటనే నిద్రపోవుచున్న కుమారుని లేపి, తమ నిర్ణయంను తెలియజేసిరి, కుమారుడు కూడ ఆనందంతో అంగీకరించెను. “మనము ఎవరి ఉప్పు తిని జీవించుచున్నామో, అట్టివారికొరకు, అందుకు జగన్మాతయగు దుర్గాదేవికి నా శరీరం నిచ్చుట ఎంత ఆదృష్టము!" అని పుత్రుడు నిర్మలమనసుతో తన సమ్మతి తెలియజేశాడు.

ప్రతాపుడు ఆనందంతో అప్పుడే కుమారుని వెంటబెట్టుకొని దుర్గాలయమునకు బయలు దేరినాడు. వారివెంట ప్రతాపసేనుని భార్యయు నుండెను. వీరు బయలుదేరిన రెండు నిమిషములకే మహారాజుకూడ అక్కడకు వచ్చెను. అక్కడ ఉన్న గూఢచారి "మహారాజాః ప్రతాపసేనుడు యిప్పుడే తన భార్య పుత్రులతో యిటు వెళ్ళినాడు" అని తెలియజేశాడు. మహారాజు వెంటనే ప్రతాపసేనుడు వెళ్ళిన మార్గమున బయలుదేరెను.

ప్రతాపసేనుడు తిన్నగా భార్యపుత్రులతో దుర్గాలయంనకు వెళ్ళాడు. మహారాజుకూడ ఆలయమున ప్రవేశించి "వారేమి చేయుదురో చూచుటకై రహస్యంగా పొంచుండి వీక్షింపసాగాడు.

వ్రతాపసేనుడు దేవిని పూజించి, పుత్రునికి తిలకం (బొట్టు) పెట్టి "అమ్మా! ఈ బాలుడు నా పుత్రుడు. దీనిని మనస్ఫూర్తిగా నీకు సమర్పించుచుంటిని, వీనిని స్వీకరించి, మా ప్రభువును అకాల మరణంనుండి తప్పింపుము. అతనివంశం నుద్దరింపుము" అని పలుకుచు ఖడ్గముతో కుమారుని మెడ ఖండించెను.

పుత్రుని మరణం కండ్లారజూచిన తల్లి హృదయం ఆ దారుణ దృశ్యానికి తట్టుకోలేకపోయింది. వెంటనే భర్తచేతిలో నున్న ఖడ్గంను తీసుకొని పొడుచుకొని మరణించినది. ప్రతాపునికి భార్య మరణంతో జీవితము మీద విరక్తి పుట్టినది. "అమ్మా! మా జీవితము లేమైనను, ప్రభువును కాపాడుము. నీ మాటను నిలబెట్టుకొమ్ము" అని పల్కుచు తాను కూడ శూలంతో పొడుచుకొని మరణించెను. క్షణాలమీద వారు ముగ్గురు దేవికి బలి ఐపోయిరి.

మహారాజు అ దృశ్యమంతయు తిలకించి "ఆహాః స్వామిభక్తి వరుడగు ప్రతాపుని వంటివాడు నాకిక లభ్యమగునాః నాకై త్యాగము చేసిన ఈ మహావీరుని ఋణము నేనెట్లు తీర్చుకొందును: ఇట్టి ప్రభుభక్తి పరాయణుని విడిచి జీవించుటకంటే హీనం ఇంకొకటుందాః" అని తలంచుచు తానుకూడ మరణించుటకై కత్తినెత్తెను.

అంతె దుర్గాదేవి ప్రత్యక్షమై "మహారాజాః తొందరపడకు. మీ యిరువురికీ బండాగారుల పైగల భక్తి విశ్యాసముల గమనించుటకు నేనీ నాటక మాడాను. నా 'పరీక్షలో మీరిర్వురూ విజయం పొందినారు ", అని పలుకుచు ప్రతాపుని ఆతని భార్యను కుమారుని బ్రతికించి, వారికి పెక్కువరము లిచ్చి పంపివేసినది. "భేతాళుడిట్లు కథ చెప్పి "విక్రమార్క భూపాలా: వింటివి గదా కథః ఇందు త్యాగమూర్తి ఎవరు?" అని ప్రశ్నించెను.

విక్రమార్కుడు ఆలోచించి "భేతాళా: ప్రతాపసేనుడు తన ప్రభు సంరక్షణకై పూనుకొన్నాడు. భార్యాపుత్రుల మరణముతో విరక్తి చెంది మరణించాడు. భార్య పుత్రుని మరణము ధరింపలేక మరణించినది. తల్లిదండ్రుల మాట తీసివేయలేక బలియైనాడు. కానీ, మహారాజు తనకై త్యాగము చేసిన ప్రతాపుని కుటుంబమును గమనించి - నిజమైన త్యాగము చేసినాడు. కావున మహారాజునే త్యాగమూర్తి అని చెప్పాలి" అని బదులు పలికాడు.

నియమభంగమైంది; భేతాళుడు విక్రమార్కుని పట్టునుండి యెగిరి చెట్టు పైకి చేరుకున్నాడు. విక్రమార్కుడు తిరిగి భేతాళుని కొరకై వెనుకకు మళ్ళినాడు. విక్రమార్కుడు మరల భేతాళుని బంధించి, భుజముపై పెట్టుకొని ముందుకు బయలుదేరాడు. తిరిగి భేతాళుడు ఇట్లా చెప్పసాగాడు.