ప్రతాపసేనుని కథ



పూర్వకాలంలో మగధ భూపాలునికి ఒక అంగరక్షకుడు ఉండేవాడు. అతని పేరు ప్రతాపసేనుడు. పేరునకు తగిన ప్రతాపం గలవాడు. అంతకు మించిన స్వామిభక్తి గలవాడు.

ఒకనాటి రాత్రి ప్రతాపసేనుడు ప్రభుకొలువునుండి. తన గృహంనకు బయలుదేరాడు. అప్పటికి ఆర్థరాత్రి అయింది. చీకట్లు నలుమూలలా దట్టంగా అల్లుకొన్నాయి. అట్టి చీకటిలో ధీరుడైన ప్రతాపసేనుడు యింటికి ఒంటరిగా వస్తున్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ రత్నం దుఃఖించుచు పోవుచున్నట్లు అతనికి గోచరించినది. ఆమె దుఃఖకారణం తెలిసికొనుటకై ప్రతాపసేనుడు ఆమెను వెంబడించెను. కానీ, తాను ఎంత త్వరగా నడచిననూ ఆమెను కలిసికోలేకపోయాడు.

కొంతసేపటికి ఆ స్త్రీ రత్నం ఊరి చివరనున్న దుర్గాలయంలోనికి ప్రవేశించింది. ప్రతాపసేనుడు లోనికి ప్రవేశించెను. ఆ స్త్రీ కొరకు లోపల వెతికెను. కాని, ఆమె కనిపించలేదు. అందువలన "ఆ స్త్రీమూర్తి దుర్గాదేవియే అయి ఉండవచ్చునని" ప్రతాపసేనుడు తలంచి "అమ్మా। నీవు యీ నగర సంరక్షకురాలవు. తల్లీ! నీకు వచ్చిన ఆపాయమేమి దయయుంచి తెలియజేయుమమ్మా" అని వేడుకొన్నాడు.

అప్పుడు దేవీ విగ్రహం నుండి యిట్లు వినబడెను. "ప్రతాప: నాకు ఏ ఆపాయము రాలేదు. మీ మహారాజునకే రేపటితో ఆయువు తీరుచున్నది. అతని అకాల మరణంకే దుఃఖించుచున్నాను" అని.
ప్రతాపుడు చేతులు జోడించి "అమ్మా। ఆ అకాలమరణం నుండి ప్రభువును రక్షించు మార్గమున్న తెలియజేయుము. నా ప్రాణముల నిచ్చియైన మహారాజును కాపాడుకొందును" అని పలికెను.

"మార్గమున్నది, వినుము. స్వామి భక్తిగలవాడు తన కుమారున్ని నగరదేవతకు అనగా నాకు బలి యిచ్చిన మహారాజునకు గండం తప్పును" అనెను దుర్గాదేవి.