రామకృష్ణుని బాల్యం



విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే గార్లపాటి రామయ్యా , లక్ష్మమ్మ అను బ్రాహ్మణ దంపతులుకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు.

అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్ళకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యంతో చనిపోతాడు, తండ్రిని కోల్పోయిన రామకృష్ణుడుకి మరియు అతని తల్లికి ఆ గ్రామంలో నా అనువారు ఎవరూ లేకపోవడం వల్ల తెనాలి వాస్తవ్యుడైన ఆమె తల్లి సోదరుడు ఆమెను మరియు రామకృష్ణుని తన వెంట ఇంటికి తీసుకొని పోతాడు. తండ్రి లేని పిల్ల వాడు అవడం వల్ల రామ కృష్ణుడిని అతని తల్లి మరియు మేనమామలు చాలా గారాబంగా మరియు అల్లారుముద్దుగా పెంచుతారు, దాంతో రామకృష్ణుడు చదువు అటకెక్కుతుంది. అతను క్రమేపి చెడ్డ పిల్లలతో స్నేహం చేయడం ఆరంబిస్తాడు.

అతనికి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చేయాలనుకున్న సొంత మేనమామ మరియు అతని తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. రామకృష్ణుడు చెడిపోతున్నాడని బాధపడి క్రమంగా కొట్టడం కూడా మొదలు పెడుతుంది అతని తల్లి. దాంతో రామకృష్ణుడు ఇంటికి రావడం మానివేసి ఊరిలోని దేవాలయాలలోని, సత్రాలలో కాలం గడుపుతూ ఇంటి మొహం చూసే వాడు కాదు. కొడుకు తిండి తిప్పలు లేక ఇంటి ముఖం పట్టక పూర్తిగా చేతికి అందకుండా పోతున్నాడని తల్లి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది.

ఒకరోజు రామకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊరు బయట ఆడుకుంటూ ఉండగా. ఆ సమయంలో ఒక యోగి రామకృష్ణుడుని చూస్తాడు. అతనిని చూసి యోగి “ఇంత అందమైన బాలుడు ఇట్లా చెడిపోతున్నాడని భావించి ఇతనిని ఎట్లైనా బాగు చేయాలని, రామకృష్ణుడుని తన వద్దకు పిలిచి అతని కులగోత్రాలు అడిగి తెలుసుకుంటాడు.

బ్రాహ్మణ పిల్లవాడు అయిన నీవు చదువు సంధ్యలు మాని ఈ విధంగా ఆటలతో కాలం గడపటం మంచిది కాదు. కనుక నీకు నేను ఒక మహా మంత్రం ఉపదేశిస్తాను. దానిని చదివిన వెంటనే నీవు గొప్ప విద్యావంతుడువి మరియు మంచి పేరు తెచ్చుకుని చక్కని జీవితాన్ని పొందుతావు అని చెప్తాడు. అప్పుడు రామకృష్డుడు “స్వామీ మీరు వెంటనే నాకు ఆ మహామంత్రమును ఉపదేశించండి అని కోరుకుంటాడు. వెంటనే యోగి రామకృష్ణుని వెంటబెట్టుకుని ఒక గుహలోనికి తీసుకుని పోతాడు. అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి రమ్మని రామకృష్ణడుకి ఆ యోగి ఆదేశిస్తాడు.
రామకృష్ణుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ యోగి రామకృష్ణునికి ఆ మహా మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. తర్వాత ఆ యోగి రామకృష్ణుడిని చూసి “కుమారా నీవు ఈ మంత్రమును మీ గ్రామమునందు ఉన్న మహాకాళికా మాత గుడి లో కూర్చుని భక్తి శ్రద్ధలతో జపించుచూ” దేవి అనుగ్రహం నీవు తప్పక పొందగలవు నీకు శుభం కలుగుతుంది అని దీవించి అక్కడనుంచి వెళ్ళిపోతాడు.

రామకృష్ణుడు ఆరోజు రాత్రి ఊరిలో ఉన్న కాళికామాత గుడికి చేరుకొని, గర్భగుడిలో ఉన్న మహాకాళి విగ్రహం ముందు కూర్చుని యోగి చెప్పినా మంత్రోపదేశంని భక్తిశ్రద్ధలతో పాటిస్తాడు. రామకృష్ణుని భక్తిని చూసి ఎంతో సంతోషించిన కాళికామాత రామకృష్ణుడి ముందు ప్రత్యక్షమవుతుంది.

కాళికామాత ప్రత్యక్షమవగానే వెయ్యి తలలు మరియు చేతులతో భీకరంగా ఉన్న కాళికామాతను చూసి రామకృష్ణుడు పకపకా నవ్వడం ఆరంభిస్తాడు. రామకృష్ణుడు అలా నవ్వడాన్ని చూసిన కాళీమాతకు కోపం వచ్చి రామకృష్ణుడితో ఇలా అంటుంది. “ఓయీ..! రామకృష్ణ నన్ను చూచి భయపడని వారంటూ ఎవరూ ఉండరు కానీ నీవు నన్ను చూసి పకపకా నవ్వుతున్నావు. నీ నవ్వుకు గల కారణం ఏమిటి అని కోపంగా చూస్తోంది”.

మాత మాటలు విని రామకృష్ణుడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇట్లు పలికెను. “తల్లి నిన్ను చూసి నవ్వినందుకు నన్ను క్షమించు కాళికామాత నేను నీ భక్తుడిని, నీ రూపం చూసినప్పుడు నా మదిలో ఒక సందేహం కలిగినది”. అందువల్ల ఆ సందేహం గుర్తుకు వచ్చి నేను నవ్వు ఆపుకోలేకపోయాను అని చెప్పెను.

అప్పుడు కాళికాదేవి రామకృష్ణుడిని నీకు వచ్చిన సందేహం ఏమిటి అని ప్రశ్నించగా. అప్పుడు రామకృష్ణుడు ఇలా సమాధానం చెప్పను “ఒక్క తల గల నేను జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకొనుటకు రెండు చేతులు నొప్పి పుట్టి బాధపతుంటాను. అలాంటిది వెయ్యి తలల గల నీవు జలుబు పట్టినప్పుడు ఎంత బాధ పడి ఉంటావో అన్న సందేహం కలిగి నవ్వు వచ్చెను అని అంటాడు.
రామకృష్ణుడు కలిగిన సందేహం విని దేవి లోలోపల నవ్వుకొనుని అతనికి ఏదైనా మేలు చేయదలచి, కుడి మరియు ఎడమ చేతిలో రెండు పాత్రలను సృష్టించి ఒక దానిలో పాలు మరియొక దానిలో పెరుగుతో నింపి, పెరుగు తాగినచో విద్యాబుద్ధులు లభించును, పాలు తాగినచో ధనప్రాప్తి కలుగును అని చెప్తుంది.

అప్పుడు కొంచం సేపు ఆలోచించిన రామకృష్ణుడు కాళికామాతతో ఇలా అంటాడు. అమ్మా ఆ రెండు పాత్రలను నా చేతికిస్తే వాటిలో ఏది రుచిగా ఉందో చూసి అప్పుడు స్వీకరిస్తాను అని చెప్పగా. అప్పుడు దేవి తన చేతుల్లో ఉన్న రెండు పాత్రలను అతనికి ఇస్తుంది. ఆ రెండు పత్రాలను తన చేతిలోకి తీసుకోనీ వాటిలో ఉన్న పాలు మరియు పెరుగును కలిపి రామకృష్ణుడు తాగి వేసెను. అమ్మ నువ్వు నాకు ఇచ్చిన రెండు పాత్రలలోని పాలు మరియు పెరుగు ఎంతో రుచిగా ఉన్న కారణమున నేను రెండింటిని తాగి వేసితిని.

అంతే కాకుండా మానవునికి విద్య, ధనము రెండు అవసరమైనవే. ధనం ఉండి విద్య లేకపోతే మానవునికి గౌరవముండదు మరియు విద్య ఉండి ధనం లేకపోతే మానవుడికి సుఖం ఉండదు. నాకు విద్య మరియు ధనం రెండూ అవసరమే కనుక రెండిటినీ తాగితిని. కావున నా పైన కోపం తెచ్చుకోకుండా, నాయందు దయ ఉంచి నాకు విద్య మరియు ధనం రెండింటిని ప్రసాదించాలని కోరుతున్నాను. పిల్లలు ఎంత చెడ్డ వారు అయినను తల్లులు వారిని దండించదరు కావున నన్ను >మన్నించవలసిందిగా కోరుచున్నాను అని వేడుకొనెను.

రామకృష్ణుని పని కాళికాదేవికి కొంచెం కోపం తెప్పించినా.. అతని మాటలు ఆమెకు జాలి కలిగించినవి. అయినా కూడా హద్దుమీరి ప్రవర్తించిన రామకృష్ణుని పూర్తిగా క్షమించని కాళికాదేవి “వికటకవి” అవుదువు గాక అని శపించెను. నా తప్పులను క్షమించి నాకు దారిద్రము కలగకుండా కాపాడు అని రామకృష్ణుడు కాళికాదేవిని ప్రార్ధించెను.
అతని ప్రార్థనలు విన్న కాళికాదేవి రామకృష్ణ నీవు వికటకవి అయినా కూడా రాజుల చేత గౌరవింపబడగలవు మరియు మంచి పేరు ను కూడా పొందుతావు భయపడకు అని అభయమిచ్చి మాయామయ్యారు.