రామలింగడి గురుపూజ



అనేకవిధాల తనని పరిహసిస్తున్న రామలింగడి మీద బహిరంగంగా పగ సాధించాలని నిశ్చయించుకున్న తాతాచార్యులవారు “రేపు వ్యాసపౌర్ణమి. గురుపూజ. కవులందర్తోపాటు లింగడూ మా ఇంటికొస్తాడు. చచ్చినట్టు మా కాళ్లు కడిగి పాదపూజ చేస్తాడు.

అప్పుడు ఏదో వంకతో వాడి ముఖం పగిలేలా తన్ని పగతీర్చుకుంటాం..." అన్నారు.అప్పన్న వికవిక నవ్వి "ఇన్నాళ్ళకి తమ బుర్ర పులిహోరలా ఘాటుగా పనిచేసింది. ఆ లింగడి గాడికి తమరు చేసే అవమాన శృంగభంగం అందరికీ తెలియద్దూ... నే వెళ్లి... టముకు వేసినట్టు కనిపించిన వాళ్లందరికీ ఈ రహస్యం చెప్పివస్తా... 'రహస్యం' అని చెప్పి ఏడుస్తాలెండి...” అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు.

బయట ఎండ చురచుర లాడ్తోంది. ఆ ఎండ తీవ్రతకి అప్పన్నకి చెమటలు పట్టేస్తున్నాయి. సూర్యతాపానికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ ఎండలో ఎంతోదూరం నడవలేక ఒక చెట్టు నీడన నిలబడ్డాడు అప్పన్న.“అయ్యో... ఎంతో గొప్ప రహస్యం ఎవడికీ చెప్పలేకపోతున్నానే... ఎండ భయంతో ఒక్కడూ కనిపించడం లేదే... రంగా... కావేటి రంగా... కడుపుబ్బరం భరించలేక చచ్చిపోతున్నా... ఎవడో ఒకడ్ని నా దగ్గరికి పంపవయ్యా తండ్రీ... ఈ రహస్యం వాడికి చెప్పి కడుపుబ్బరం తీర్చుకుంటా...” అన్నాడు అప్పన్న.

“రహస్యమా...? ఏమిటది?” ప్రశ్న వినిపించింది ప్రక్కనించే. అప్పన్న తల అటు తిప్పి చూశాడు. కళ్లు బైర్లు కమ్మడం వల్ల ఆ వ్యక్తి ఎవరో ఆనవాలు తెలియడం లేదు. '

ఆ.. ఎవడైతేనేం? రహస్యం చెప్పడానికొకడు దొరికాడు చాలు'.అప్పన్న విక విక నవ్వి "మరేం లేదు, రేపు గురుపూజ చెయ్యడానికి ఆ లింగడు మా గురువుగారి దగ్గరికి వస్తాడు కదా... వాడు ఆయన కాళ్లు కడుగుతుండగా ఏదో వంక పెట్టి గురువుగారు వాడ్ని కాలెత్తి తన్ని అవమానిస్తార౦ట....

దెబ్బకి దెబ్బ...”అని నవ్వి "బాబ్బాబూ... ఇది రహస్యం. ఎవరికీ చెప్పకండి" అన్నాడు