రాయలవార్ని రక్షించిన తిట్టు



విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, ప్రాభవాన్ని గాంచి ఈర్ష్య చెందిన అనేకమంది చిన్న చిన్న రాజులు, మండలాధీశులు విజయనగర సామ్రాట్టు అయిన రాయలవార్ని హతమార్చడానికి అవకాశాల కోసం కాచుకున్నారు. ఒకసారి రాయలవారు తమ ఆస్థానకవులతో కలిసి తుంగభద్రానదీ తీరంలో విహారయాత్రకి వెళ్లారు. ఆ సమయంలో వారివెంట అంగరక్షకులు మాత్రమే ఉన్నారు.

అంగరక్షకులు వాదిస్తున్నా రాయలవారు ఖాతరు(లెక్క) చెయ్యకుండా పడవలో కవుల బృందంతో కలిసి నదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరి అక్కడ కవితాసభ పెట్టారు. రాయలు సైన్యం లేకుండా నదీతీరాన విడిది చేశాడని వేగుల ద్వారా కనిగిరి రాజు గజపతికి సామంతుడైన పసరము గోవిందరాజులుకి వార్త అందింది. అదే తగిన అదునుగా భావించి అతడు తగు సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు.

రాయలవారి అంగరక్షకులు వాళ్లని ఎదిరించి రెప్పపాటులో నేలకూలారు. ఒంటరియైన రాయలని చుట్టుముట్టాడు గోవిందరాజు, రాయలవారు ఆవేశంతో కత్తిదూసి "మేము విసిరిన గడ్డిపరకలు కత్తికి మా విరోధుల చెంత చేరిన పశువ్వి, నువ్వు మమ్మల్ని వెన్నుపోటు పొడవ సాహసిస్తావా? రారా..... విజయనగరా ఆధీశుని వీరత్వం ఏమిటో రుచిచూద్దువు రా..." అంటూ ఆగ్రహంతో ముందుకు దూకారు.

అంతలో వారికంటే వెర్రి ఆవేశంతో గోవిందరాజులు ముందుకి దూకాడు రామకృష్ణుడు. అతడు ఆగ్రహంతో కళ్ల వెంట నిప్పులు రాలుస్తూ…

క. బసవనకు బుట్టినప్పుడే

పసరము గోవిందరాజు పసరకి జైనన్

గననేటికి దినడనగా

గసువుందిను శత్రులాజి గదిసినవేళన్.

అంటే బసవడు అంటే ఆంబోతు. ఆంబోతు అంటే పశువు. గోవిందరాజు తండ్రి పేరు బసవరాజు. పశువు వంటి బసవడికి పుట్టినప్పుడే గడ్డితినే పశువు గుణం వచ్చిన గోవిందరాజు శత్రువుల గడ్డితిని పశువయ్యాడు. ఇప్పుడా పశువు గడ్డి తినే బుద్ధిచేత మిడిసిపడుతోంది అని తిడుతూ పద్యం చెప్పాడు రామకృష్ణుడు.

అంతే! ఆ తిట్టు గోవిందరాజు చెవులని తాకుతూనే ఫిరంగి గుండుదెబ్బలా పనిచేసి అతడు రక్తం కక్కుకుంటూ నేలకూలి చచ్చాడు. అతడి చావుని చూసిన సైనికులు భయంతో పరారైపోయారు.

అప్పుడు పెద్దనగారు, రామకృష్ణుడి ప్రతిభని మెచ్చుకుంటూ "భళిరా రామకృష్ణా! ఒక్క తిట్టు కవిత చెప్పి నీ వాక్శక్తిని నిరూపించావు.

పద్యంతో శత్రువు గుండె బ్రద్దలు చేసి రాయల్ని రక్షించావు. శభాష్! కవిత్వం అంటే నీదే కవిత్వం" అని ప్రశంసించాడు.

రాయలు ఆనందం పట్టలేక రామకృష్ణుడిని అక్కున చేర్చుకున్నాడు.