సన్యాసి - ధీరేంద్రుల కథ



మహారాజా! పూర్వము కాంభోజ నగరాన్ని వీరేంద్ర సింహుడనే రాజు పరిపాలించేవాడు. అతని కుమారుడు ధీరేంద్రుడు- ధీరేంద్రుడు చిన్నతనము నుండియు అనేక విద్యలు నేర్చుకొన్నాడు. మంచి అందగాడు కూడ. సితిగలవాడే. అయినను వానికి ఒక వేశ్యతో సంపర్కము కలిగినది. ఆది మొదలు ఆమె యింటనే ఎక్కువగా వుంటుండెవాడు. ధీరేంద్రుడు ఆమెకు యిచ్చుచున్నంత కాలమూ ఆ వేశ్య అతనిని బాగా చూచుచు వయ్యారాలు ఒలికించెడిది.

క్రమముగా ధీరేంద్రుని సంగతి తండ్రికి తెలిసి కుమారుని పట్ల గట్టి బందోబస్తు చేయించినారు. అందువల్ల కోటలో అతనికి ఒక్క రొక్కం గూడ కోశాధికారి యిచ్చేవారు కారు. అయిననూ ధీరేంద్రుడు వేశ్యకు ధనము తెచ్చి యిచ్చేవాడు. ఆ ధనం ఎలాగు తెచ్చేవాడో తెలుసా:

మిత్రులవద్ద అబద్ధాలు చెప్పి తెచ్చేవాడు. రాజపుత్రుడు" గదా: అని వారు యిచ్చేవారు. అదెంతకాలం సాగుతుంది? నెల రోజులకే వారికి విసుగు పుట్టింది: ఇవ్వడం మానివేశారు. ముఖం చూపించడము కూడ మానుకున్నారు. ధనము తెచ్చి యివ్వడం లేదని ఆ వేశ్య అతనిని ఇంటికి రానీయక తరిమివేసినది; ఇంకొక ధనవంతునితో కులుకసాగినది.

ధీరేంద్రుడు కోపము అణచుకొనలేక యుక్తా యుక్తములు మరచి ఆ ధనవంతునితో జగడము పెట్టుకొన్నాడు. ధనవంతునికి కాని పని ఈ లోకములో ఉందా? అతడు కొంతమంది రౌడీలను పురమాయించినాడు. వారు ధీరేంద్రుడు ఒంటరిగా వెళుతున్న సమయంలో బాగా కొట్టి, ఒక అడవిలో పారవేసినారు. ఆ అడవి ఆ నగరానికి చాలా దూరం. ధీరేంద్రుడు తిరిగిరాడని, ఏ జంతువులు వానిని చంపివేయునని, తమ మీద ఎవరికీ అనుమానం ఉండదని - ఆ రౌడీలు భావించి అలా దూరంలో గల అడవిలో పారవేశారు.

కానీ, ధీరేంద్రుని అదృష్టం బాగుంది. ఒక సిద్ధుడు అటు పోతూ ధీరేంద్రుని చూచి జాలిపడి తన ఆశ్రమానికి తీసికొనిపోయినాడు. కొద్ది రోజులకే ధీరేంద్రుడు ఆరోగ్యవంతుడయ్యాడు.
ఒకనాడు సిద్ధుడు ధీరేంద్రుని కథ అంతా విన్నాడు. "వీనికి కామేచ్చ యెక్కువగా ఉన్నది; వీని కామం తగ్గినగాని వీడు సరియైన దారికి రాడు" అని నిశ్చయించుకొన్నాడు. వెంటనే సిద్ధుడు తన యొక్క విద్యాప్రభావం ప్రదర్శించినాడు. ఆ ప్రభావంవల్ల అక్కడ ఒక దివ్యమైన సౌధము, అందు దాస దాసీజనము - భుజించుటకు తగిన షడ్రసోపేతమైన పదార్థములు, దీరేంద్రుడు ఊహించనట్టి రంభను మించిన సుందరాంగి ఏర్పడినది.

ఆ విధముగా ధీరేంద్రుడు కొన్నాళ్ళు దివ్యభోగములు అనుభవించాడు. నెలరోజుల తరువాత సిద్ధుడు తన మాయావిద్యను ఉపసంహరించాడు. అందువల్ల అవి అన్నీ మాయమమ్యాయి. యధాప్రకారంగా అడవియే కనిపించింది.

అంగనాసంభోగానికి, రాజాధిరాజులకుగూడా జరగని సుఖజీవితానికి అలవాటుపడిన ధీరేంద్రుడు ఒక్కసారిగా ఆధోలోకములో పడిపోయినట్లయినాడు. సిద్ధుని ప్రార్ధించినాడు. సిద్ధుడు కరుణించినాడు. మరల తన విద్యాప్రధానము ప్రయోగించి ధీరేంద్రుని ముచ్చట తీర్చాడు.

సిద్ధుడు ఒకనాడు ధీరేంద్రుని పిలిచి, "నాయనా: ఇక నీ విలాస వాంఛలను విడిచిపెట్టు, మీ రాజ్యమునకు పోయి హాయిగా నుండుము" అని హితోప దేశం చేశాడు. కానీ ధీరేంద్రుడు వినలేదు." ఇక కొద్ది రోజులు నాకు యీ ఆనందాన్ని ప్రసాదించుడు. తరువాత నేనే వచ్చి విన్న వించుకుందును. అప్పుడు మీ విద్య ఉపసంహరించుడు" అని ప్రార్ధించెను. సిద్ధుడు సమ్మతించి, పోయి తన ఆశ్రమంలో తపస్సు చేసికొనుచుండెను.

తరువాత ధీరేంద్రుడు — క్రూరేంద్రుడయినాడు. "ఈ సిద్ధుడు మరల ఒక నెల రోజులకే వచ్చి పొమ్మనును. పోకున్న తన విద్యను ఉపసంహరించును. మరల అంతా అడవిగా మారిపోవును. కావున యిప్పుడే యీ సిద్ధుని లేకుండ జేసినచో యివి అన్నీ ఇలాగే ఉండిపోవును. నేను సదాసుఖముగా ఉండవచ్చును”. అని తలపోసినాడు.

ఆ తరువాత ధీరేంద్రుడు ఒకనాడు ఆర్థరాత్రమున ఖడ్గహస్తుడై సిద్ధుని ఖండించుటకు ఆశ్రమానికి బయలుదేరాడు. ఎప్పుడు ధీరేంద్రుడు మయా సౌధమునుండి బయలుదేరాడో అప్పుడే ఆశ్రమంలో తపస్సమాధి యందున్న సిద్ధునికి ఒళ్ళు జలదరించింది.
"ఏమిది: నా శరీరము అదరినట్లయినది. నాకేమైన ప్రమాదం సంభమింపనున్నదా?" అని సిద్ధుడు అనుకొనుచుండగనే- మారమునుండి ఖడ్గహస్తుడై దొంగవలె తక్కుచు తారాడుచు వచ్చుచున్న ధీరేంద్రుని రాక కనిపించినది. వాత్సల్యముతో చూచుచున్న ధీరేంద్రుడు ఖడ్గహస్తుడై వచ్చుచున్నాడు; నన్ను ఖండించుటకా? లేక విషయభోగములకు తృప్తి చెంది. మాయ ఉపసంహరించు మని చెప్పుటకా? అట్ల యిన చేతిలో ఆ ఖడ్గ మెందులకు?" అని తలంచుచు- ఎందుకైనా మంచిదని తన ఆత్మరక్షణకు తగిన కట్టుదిట్టము చేసికొన్నాడు. ఏమియు గమనించని వానితో తపస్సమాధిలో ఉన్నట్లుగానే కనులు మూసికొని కూర్చున్నాడు సిద్దుడు.

దీరేంధ్రుడు ఆశ్రమంలోనికి దూరినాడు. "సిద్ధుడు మహాతపస్స మాధిలో ఉన్నాడు. చుట్టుప్రక్కల ఎవ్వరూలేరు. తను యీ పని చేసినట్లు ఎవ్వరూ అనుమానించరు. ఇంతకంటే మంచి సమయం దొరుకదు" అని నిశ్చయించుకొని సిద్ధుని ఖండించుటకై కరవాలమును పైకి యెత్తెను.

కానీ, ఎత్తిన కత్తి ఎత్తినట్లే యుండిపోయినది. శిలాప్రతిమవలె ధీరేంద్రుడు నిలబడిపోయాడు. ఎటూ కదలలేక విలవిలలాడి పోతున్నాడు. సిద్ధుడు కన్నులు విప్పాడు. అతనిని జూచి సిద్ధుడు కోపము ఆపుకోలేకపోయాడు.

"క్రూరాత్మా: నిన్ను పుత్రవాత్సల్యముతో చూశాను. నీ కోరిక తీర్చుటకై కష్టపడి సంపాదించిన విద్యను గూడ ధారపోశాను. అయినా, నీవు క్రూర బుద్ధిని చూపించావు. నన్ను చంపినంతమాత్రాన, నీకే భోగాలు స్థిరముగా ఉంటాయిరా మూర్ఖుడా! నీవంటివాడు యిక ఎన్నడూ బాగుపడడు. నేను బుద్ధి మంతుడవవుతావని భ్రమించాను. చీఛీ నీది పాషాణ హృదయమురా ఇక నుండి నీవు పాషాణములై (శిల) ఉందువుగాక అని శపించాడు. ధీరేంద్రుడు పెద్దరాయిగా అయిపోయాడు.

"మహారాజా! విన్నావుగదా: కథ: సిద్ధుడు ఆ రాజకుమారుని శపించక వదిలి పెట్టవచ్చునుగదాః వాత్సల్యముచేత?" అని ప్రశ్నించాడు భేతాళుడు విక్రమార్కుని,
"లేదు; సిద్ధుడు చెప్పినదే సత్యము. అటువంటి క్రూరబుద్ధులు కాగలవారు మరల తిరుగనారంభించిన, ఎన్నియో క్రూరాలు జరుగుతాయి. రాయిలా పడి ఉంటేనే లోకం బాగుపడుతుంది. అందుకే సిద్ధుడు. అటువంటి శిక్షవేశాడు" అన్నాడు. విక్రమార్కుడు.

ఈ విధంగా మౌనభంగము అగుటచే, భేతాళుడు రివ్వున యెగిరి వృక్షము చేరుకొన్నాడు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి వృక్షము వైపు పయనించాడు.
విక్రమార్కుడు తిరిగి భేతాళుని బంధించినాడు. భుజముపై వేసికొని వస్తుండగా - భేతాళుడు యింకొక కథ ప్రారంభించినాడు.