సతీ సావిత్రి సత్యవంతుల వివాహం



అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నాడు. సావిత్రి తన చెలికత్తెల వలన ద్యుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు రూపవంతుడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కాని సిగ్గుపడి ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఒక రోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేసాడు. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి " రాజా! నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చెయ్యలేదు " అని అడిగాడు. ఆశ్వపతి " అమ్మా! నారదుడు చెప్పినది విన్నావుగా నీకు తగిన భర్తను నీవే ఎంచుకో " అని అడిగాడు.

సావిత్రి " తండ్రీ! సాళ్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. కాని ఆ సాళ్వ భూపతి విధి వశాత్తుగా కళ్ళు పోగొట్టు కున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవులలో నివసిస్తున్నారు. అయినా నేను సత్యవంతునే వివాహం చేసుకుంటాను " అన్నది. ఆశ్వపతి నారదునితో " మహర్షీ ! సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి " అని అడిగాడు. నారదుడు. రాజా అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాశ్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. శౌర్యంలో దేవేంద్రుని మించిన వాడు.

తేజస్సులో చంద్రుడు అందంలో అశ్వినీదేవతల వంటి వారు. శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కాని అతడు అల్పాయుష్కుడు . వివాహం అయిన ఒక సంవత్సరంలో మరణిస్తాడు " అన్నాడు. అశ్వపతి కుమార్తెతో " అమ్మా నీకు అల్పాష్కుడైన భర్త ఎందుకు వేరొకరిని వరించు " అన్నాడు. సావిత్రి " తండ్రీ ! త్రికరణములలో మనను ప్రధానం కదా. ఆ మనసులో నేను సత్యవంతుని వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరు వరుని వరించను " అని పలికింది. నారదుడు " నీ కుమార్తె గుణ వంతురాలు. ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని. ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు " అని దీవించి వెళ్ళాడు.

నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంభారాలతో అడవిలో ఉన్న ద్యుమత్సేనుని వద్దకు వెళ్ళాడు. ద్యుమత్సేనుడు అశ్వపతిని తగురీతిని సత్కరించాడు. అశ్వపతి " ద్యుమత్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి. ఈ మెను నీ కోడలిగా స్వీకరించుము " అన్నాడు. ద్యుమత్సేనుడు " అయ్యా! మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా " అన్నాడు.

అశ్వపతి "రాజా! సంపదలు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. కాదనకండి " అన్నాడు. ద్యుమత్సేనుడు కాదనలేక పోయాడు. సావిత్రీ సత్యవంతుల వివాహం జరిగింది.