సత్యవ్రతుడు తన వాగ్దానం నిలుపుకొనుట



దేవాలయము చూడగనే సత్యవ్రతునికి తాను దేవికి ఒనగిన వాగ్దానము జ్ఞాపకము వచ్చినది. "అయ్యో! ఎంత అపచారము: పెండ్లి అయి నెల రోజులు కావచ్చుచున్నది. విషయలోలుడనై దేవి కిచ్చిన మాట మరిచిపోయాను. ఎంత అపచారం జరిగింది;" అని మనస్సులో తలంచి, వీరధవళుని జూచి "బావా! ఇక్కడనే ఉండుము. దేవిని దర్శించి వత్తును" అని పలికి గుడిలోనికి వెళ్ళెను. వీరధవళుడు అక్కడనే అతనిరాకకు ఎదురుచూడసాగెను.

అరగంట కాలము గడచినది. కానీ, సత్యవ్రతుడు గుడి లోపలనుండి తిరిగి రాలేదు. అందువలన వీరధవళుడు "బావ యింత సేపు ఏమి చేయుచున్నాడు" అని తలంచుచు తాను, కూడ ఆలయంలోనికి వెళ్ళాడు. గుడిలోనికి పోయిన వీరధవళుడు అక్కడి దృశ్యమును గాంచి నిర్ఘాంత పోయినాడు. దేవి విగ్రహం ముందు సత్యవ్రతుడు శిరస్సు ఖండించుకొని పడియున్నాడు. నెత్తురు కాల్వగట్టి పారుతూ ఉంది.

"అయ్యో! ఇదేమి గ్రహచారముః ఎందుకై యితడు తన శిరస్సును దేవికి కానుక యిచ్చెను. ఈతని మరణం గురించి ఇంటిలో ఎలా చెప్పగలను? చెప్పిన వారు నమ్ముదురా? చెల్లెలి వైధవ్యము చూస్తూ నేను జీవించగలనా? ఛీ ఛీ ఇంత కన్న మరణించుట మేలుగదా!" అని నిశ్చయించుకొని వీరధవళుడు దేవిముందు గల ఖడ్గముతో శిరస్సు ఖండించుకొనేను.

ఈ సంగతి తెల్లవారునప్పటికి అందరికీ తెలిసింది. సుశిల, ఆమె తల్లి దండ్రులు, బంధువులు వచ్చారు. చూచి ఘోడుఘోడున దుఃఖించసాగారు. "పతిలేని సతికి యింకెక్కడి గతి" యని సుశిల గూడ మరణించుటకై కత్తి నెత్తెను. అంతట దేవి విగ్రహమునుండి తొందరపడకుము. నీ సాధ్వీ గుణమునకు మెచ్చితిని. నీ పతిని, నీ అన్నను నేను బ్రతికింతును. వినుము; నా విగ్రహం ముందుగల కలశంలోని జలమును వారిపై చల్లుము" అను మాటలు వినబడెను- సుశీల వెంటనే దేవికి నమస్కరించి తెగి పడియున్న శిరస్సులను దగ్గరకు చేర్చి, దేవి ఆనతి చొప్పున జలమును జల్లెను. సత్యవ్రతుడు, వీరధవళుడు నిద్ర నుండి లేచినట్లు లేచేరి.
అందరూ ఆనందంతో యింటికి వెళ్ళిపోయిరి.

ఈ విధంగా కథ చెప్పిన భేతాళుడు "మహారాజాః కథ వింటివిగదాః ఇందులో ఎవరు చేసిన త్యాగం గొప్పది:" అని ప్రశ్నించాడు. విక్రమార్కుడు ఆలోచించి "భేతాళాః సత్యవ్రతుడు తన వాగ్దానం నిల్పుకొన్నాడు. సుశీల-“పతి లేని బ్రతుకెందుకు" అని మరణించుటకు పూను కొన్నది. కాని, వీరధవళుడు చేసిన త్యాగం చాల విలువ గలది. త్యాగమునకు వన్నె తెచ్చినది అతని సుగుణము" అని జవాబు నిచ్చాడు. వెంటనే భేతాళుడు నియమభంగ మగుటచే తుర్రున ఎగిరి మరల చెట్టునకు అంటుకున్నాడు. విక్రమార్కుడు విసుగుచెందలేదు- మరల భేతాళుని బంధించి తెచ్చుటకై చెట్టుదిక్కును బయలుదేరాడు.

వీర విక్రమ ప్రతిభవంతుడైన విక్రమార్క భూపాలుడు, తిరిగి భేతాళుని బంధించి ఆశ్రమానికి బయలుదేరాడు. కానీ, భేతాళుడు మరల ఆతని పరీక్షింపగోరి యిట్లా అన్నాడు.

“విజ్ఞాననిధివైన విక్రమాంక భూపాలాః నీ రాకవలన, నా అనుమానలన్నియు తిరుచున్నవి. మరొక్క సందేహం వివరింతును. దానిని విని నా సందేహంను దీర్పుము" అని మరొక్క కథ చెప్పసాగెను.