సత్యశీలుని కథ



మహారాజా! నీకు మార్గాయాసం, లేని బరువు తెలికయేటట్లుగా ఒక కథ చెబుతా విను. పూర్వం ఒక గ్రామంలో సత్యశీలుడు అనే ఒక కోమటి ఉండేవాడు. అతడు మిక్కిలి పేదవాడు. అందువలన రకరకాలైన తినుబండారములను తయారు చేసి, ప్రక్క గ్రామాలకు పోయి అమ్ముకొనేవాడు. ఆ విధంగా వచ్చిన ఆదాయముతో కుటుంబాన్ని పోషించుకొనేవాడు.

ఒకనాడు మామూలుగా సత్యశీలుడు పదార్థాలను తయారు చేసికొని ఒక పళ్ళెములో ఉంచుకొని ప్రక్క గ్రామానికి బయలుదేరాడు. సత్యశీలుడు గ్రామానికీ, ప్రక్క గ్రామాలకీ మధ్య చిన్న చిట్టడవి ఉంది. జనసంచారం అంత ఎక్కువగా కూడ ఉండదు. అప్పుడప్పుడు మృగాలు కూడ తిరుగుతుంటాయి. అయినా, పొట్టకూటికై సత్యశీలుడు నిత్యమూ అలానే వెడుతూ ఉండేవాడు;
దైవం మీద భారం వేసి.

క్రమంగా సత్యశీలుడు చిట్టడివి మధ్య భాగానికి వచ్చాడు. అప్పుడు అతనికి ఎదురుగా ఒక సింహం వచ్చుట కనిపించింది. సత్యశీలుడు సింహాన్ని చూచి, భయముతో గజగజ వణికిపోయాడు. ఏమీ చేయాలో తోచక అలాగే నిలబడిపోయాడు. సత్యశీలుని అదృష్టం బాగుంది. కాబట్టి ఆ వచ్చిన సింహం, సత్యశీలుని పరిస్థితి గమనించి దగ్గరకు వచ్చి "భయపడకు; నిన్నేమీ చేయను: పోయిహాయిగా జీవించు" అంది.

సింహం మాటలకు సత్యశీలుడెంతయో ఆనందించాడు. "మహాత్మా! నీవు యీ రూపంతో వచ్చిన దేవతవు. నాకు ప్రాణదానం గావించి, నా కుటుంబాన్ని రక్షించావు. ఇట్టి దయామతివైన నీకు ఏమిచ్చినను తక్కువయే. కానీ నేను నీకిచ్చునంతటి సామర్థ్యము లేనివాడను. ఇవిగో: యీ పదార్థములను భుజించి నాకు సంతోషం కలిగించుమని ప్రార్థించాడు.

సింహం వాని బుద్ధికి మెచ్చుకొంది. ఆ ఫలహారాలను భుజించింది. ఆ పదార్థాల రుచికి మెచ్చుకొని యిలా అంది.
"ఈ పదార్థాలన్నీ చాలా బాగున్నవయ్యా। ప్రతిరోజూ యిట్టిపదార్థాలే యుంటే-నేను మాంసభక్షణ కూడ మానుకుంటాను" అని. సత్యశీలుడు సింహం మాటలకు ఆనందించాడు. "మహాశయా: మీకు అట్టి కోరికయే ఉంటే, ప్రతిరోజూ నేను రకరకాల సదార్ధాలను తీసుకొని వస్తాను. నా ప్రాణాలను కాపాడినందుకు యీ రీతిగానైనా, నా కృతజ్ఞత చూపించుకుంటాను" అని వినయంగా చేతులు జోడించి పలికాడు.

ఆనాటి నుండి సత్యశీలుడు రకరకాల పదార్థాలను సిద్ధముచేసి, తెచ్చేవాడు. సింహం వానిని భుజించి- అతనికి విలువగల మంచి మంచి రత్నాలను యిచ్చేది. సత్యశీలుడు ఆ రత్నాలతో క్రమేపి గొప్ప ధనవంతుడయాడు. అయినా తన సేవను మరచిపోలేదు. ప్రతిదినమూ సింహానికి పదార్థాలు తయారు చేసి భుజింపజేసేవాడు. కొన్నాళ్ళు గడిచాయి.

సత్యశీలుడు, సింహము స్నేహంగా ఉండడం. సింహం జంతు హింస మానెయ్యటం అనుచరులగు కాకికి, నక్కకూ యిష్టం కాలేదు. ఆ రెండూ ఆలోచించుకొని సింహానికి దుర్బోధ చేసేవి.
ప్రభూ! సత్యశీలుడు మీరనుకొన్నట్లు మంచివాడు కాదనట్లు మాకు తెలిసింది. తనుకు ఆహార పదార్థాలలో విషం కలిపి చంపాలని చూస్తున్నట్లుకూడ తెలిసింది. కావున తాము జాగ్రత్తగా ఉండండి" "అని హెచ్చిరించాయి. వారి మాటలతో సింహానికి అనుమానం కలిగింది సత్యశీలునిపై చెప్పుడు మాటలు ఎంత మంచివానియైనను మార్చి వేయును కదా!"

సరిగా అదే సమయానికి సత్యశీలుడు పదార్థాలను తీసికొని వస్తూ- సింహానికి ఒకప్రక్క కాకి, ఇంకొక ప్రక్క నక్క కూర్చొని ఏవో చెప్పడం చూచాడు; ఆ దృశ్యాన్ని చూచి - భయవడి పళ్ళెమును అక్కడ దించి, ప్రక్కనున్న ఒక వృక్షము నెక్కి కర్చున్నాడు.
సింహం తన అనుచరులతో చెట్టు వద్దకు వచ్చి మిత్రమా చెట్టుపై కూర్చున్నావేమి?" అని ప్రశ్నించింది. సత్యశీలుడిలా సమాధానమిచ్చాడు. "ప్రభూ! తమరు మంచివారే.. మిము జూచి నేనెప్పుడూ భయపడను. కొద్ది మలిన మనస్సులైన మీ అనుచరులను జూచి భయపడుచున్నాను. యజమాని మంచివాడైనా, సేవకులను బట్టి వారు మారిపోవుచుంటారు. మీకు దుస్టుల సహవాసము కలిగినది; వారి బోధనలతో మీ మనస్సు మారే అవకాశం ఉంది. కావున ఇక మీతో నుండుట ఉచితమైన కార్యముకాదు. మీ దయవలన నేను ధనవంతుడనైతిని. మిమ్ము ప్రతిరోజు తలచుకొనుచు జీవితము గడుపుదును. ఇక నన్ను మరచిపోండు" అని కృతజ్ఞతా పూర్వకంగా అంజలి ఘటించాడు.

సింహం వాని మాటలలోని సత్యము గ్రహించి "సిగ్గుపడి వెళ్ళిపోయింది." "మహారాజా! వింటివిగదా: కథః ప్రాణదానం కావించిన సింహం పట్ల సత్యశీలుడు కృతఘ్నుడైనాడు గదా!" ఆని భేతాళుడు ప్రశ్నించాడు.

విక్రమార్కుడు- "కాదు. సత్యశీలుడు నిజమే చెప్పినాడు" అన్నాడు. విక్రమార్కుని జవాబుతో భేతాళుడు రివ్వున ఎగిరి వృక్షము చేరుకొన్నాడు. విక్రమార్కుడు మరల వెనుకకు ప్రయాణం సాగించాడు.
విక్రమార్కుడు మరల భేతాళుని బంధించి- ఆశ్రమానికి బయలుదేరాడు. భేతాళుడు యీ దిగువ కథ చెప్పుటకు ప్రారంభించాడు.