శారదా విశ్వదత్తుల కథ



విక్రమార్క భూపాలా ! నీ కొక చక్కని కథ చెబుతా: విని నా సందేహనికి తగిన సమాధానమిమ్ము. పూర్వకాలంలో ఆంధ్రాననియందు "విజయదుర్గము" అను పట్టణము ఉండేది. ఆ పట్టణమున సోమశేఖరదత్తు "అనువాడు ఉండేవాడు. అతని ఏకైకపుత్రిక శారద. సుగుణాల రాశి, సౌందర్యవతి, సోమశేఖరదత్త చెల్లెలి కుమారుడు విశ్వదత్తు. విశ్వదత్తుని తల్లి తన అవసానకాలములో తన పుత్రుని సోమశేఖరదత్తుకు అప్పగించి "వీడు "అనాదుడు గాకుండా పెంచి, పెద్దజేసి, నీ పుత్రిక నిచ్చి వివాహము గావింపుము. ఇదియే నా కడసారి కోరిక" అని చెప్పి కళ్ళుమూసింది. సోమశేఖరదత్తు విశ్వదత్తుని తన యింటనే ఉంచుకొని పెంచి పెద్ద చేశాడు.

కానీ, విశ్వదత్త పెద్ద అగుచున్న కొద్దీ, మొద్దుగా తయారు అయ్యాడు. చూస్తూ చూస్తూ విద్యలేని సోమరిపోతుకు తన కూతురును యివ్వడానికి సోమ శేఖరదత్తు మనస్సులో బాధపడ్డాడు. అయినా చెల్లెలుకు తాను యిచ్చిన వాగ్దానము నిల్పుకొనుటకు, విశ్వదత్తుని విజ్ఞానిగా చేయుటకు అతడు బాగా ఆలోచించాడు; కాశీనగరంలో ఉన్న తన మిత్రునికి ఒకలేఖ వ్రాసియిచ్చి విశ్వదత్తుని కాశీనగరం పంపించాడు.

సోమశేఖరదత్తు మిత్రుడు చంద్రశేఖరదత్తు అతడు మహాపండితుడు. ఆతని విద్యా బోధనలో విశ్వదత్తు అన్ని విద్యలలోను పరిపూర్ణుడయినాడు. అప్పటికి విశ్వదత్తునకు పరిపూర్న యౌవ్వనం కూడా వచ్చింది. విశ్వదత్తు గురువుగారి శిక్షణలో మంచి సత్ప్రవర్తనమూ, వినయ విధేయతలూ, లోకజ్ఞానమూ గడించు కొన్నాడు. దుర్వ్యసనాలను దగ్గరకు రానీయకుండా, మంచి గుణాలను అలవాటు చేసికొన్నాడు.

ఒకనాడు విశ్వదత్తు గురువుగారి అనుమతిపొంది, మామగారి యింటికి బయలుదేరాడు. అతనితో సహపాఠియగు నిరంజనుడు. కూడా బయలు చేరాడు. నిరంజన-విశ్వదత్తులు విజయదుర్గము చేరుకొన్నారు. అయిదేండ్లకాలం తను కాశీనగరంలో ఉండుటవలన, విజయదుర్గము వింతగా కనిపించింది విశ్వదత్తుకు. అప్పటిలో ఉండే చిన్న చిన్న యిల్లు భవనాలు అయినాయి. వీధులు విశాలముగా చాల అందముగా వున్నాయి. ఆ వింతలు- పూర్వం ఉన్న పరిస్థితులు, అప్పటి పరిస్థితులు అన్నీ విశ్వదత్తు తోటి సహపాఠియగు నిరంజనకు చూపించుచు తీసుకొని రాసాగినాడు విశ్వదత్తు.

క్రమముగా మరొక భవనము ముందుకు వచ్చారు. అప్పుడే ఆ భవనమునుండి ఒక కన్యవచ్చి ప్రక్క గృహములోనికి వెళ్ళింది. ఆ కన్యను చూచి నిరంజనుడు ఎంతో మోజు పడినాడు; ప్రేమించినాడు. ఆ కన్య ఎవరో కాదు; విశ్వదత్తునికి కాబోవు భార్య శారదా . విశ్వదత్తు మాత్రము ఆమెను చూచిన వెంటనే గుర్తించినాడు.

నిరంజనుడు తన కోరిక విశ్వదత్తునికి చెప్పినాడు ప్రక్కకు పిలిచి, "ఎట్లయిన తనకు ఆ కన్నియ లభించునట్లు చేయు"మని ప్రార్థించినాడు. ఆ కన్నియ తనకు లభించనినాడు ఆత్మహత్య చేసుకొందునని కూడ తన తుది నిర్న యం కూడ వెల్లడించినాడు.

విశ్వదత్తుడు “ఈ కన్య నాకు కాబోవు భార్యః నా మేనమామ పుత్రిక" అని చెప్పిన వాడయిన ఎట్లుండిదో" కాని విశ్వదత్తు - మిత్రుని యొక్క ప్రార్థనతో ఆ మాట చెప్పలేక పోయాడు.
పైగా "నీకా కన్య లభించుట. కొరకై ఆమె తలిదండ్రులతో మాటాడెదను" అని వాగ్దానం చేసినాడు.

తరువాత విశ్వదత్తు మిత్రునితో ఆ గ్రామమున ఒక యింట బస చేసినారు. విశ్వదత్తు మిత్రునిజూచి "మిత్రమా! నేను వచ్చువరకు నీవు యిక్కడనే యుండుము. మా మామగారి గృహమును ఆనవాలు పట్టలేకున్నాను. ప్రయత్నించి తెలిసికొనివస్తాను . అట్లాగే ఆ కన్య యొక్క తలిదండ్రులతో కూడ మాట్లాడి వచ్చెదను" అని చెప్పి, తానొక్కడూ అత్తవారి యింటికి వచ్చాడు.

చాల కాలమునకు వచ్చిన అల్లుని చూచి అత్తమామలు, కాబోవు భర్తను చూచి శారదయు మిక్కిలి ఆనందించిరి. తరువాత విశ్వదత్త అత్త మామలను శారదను రహస్యముగా ఒక గదిలోనికి పిలిచి తన మిత్రుని కథ అంతయు చెప్పెను. "మీరు యీ విషయమును నిర్లక్ష్యము చేసిన అతడు మరణించును. అందువలన మిత్రుని చంపుకున్న పాపము నాకును. బ్రహ్మణ హత్యాపాతకము మీకును సంభవింపగలదు. కావున మీరందరును విషయమును త్రోసి పుచ్చకుడు. ఆతడు కూడ సకల విద్యాపరిపూర్ణుడం. బుద్ధి మంతుడు. నా కంటె కూడా విద్యలలో గొప్ప విజ్ఞానము గలవాడు" అని అనేక విధముల బోధించి ఎట్టకేలకు వారినందరినీ ఒప్పించినాడు.

విశ్వదత్తు అక్కడనుండి బయలు దేరి తిన్నగా మిత్రుడగు నిరంజనుడు ఉన్న బసకు వచ్చాడు. "మిత్రమా: లెమ్ము. నేను ఆ కన్య తలిదండ్రులతో మాటాడి వచ్చాను. వారందరూ ఒప్పుకొన్నారు. వారు నిన్ను చూడవలెనని ఉత్సాహపడుచున్నారు. పెండ్లి ముహూర్తము కూడ నిశ్చయించుకొందాము" అని పలికినాడు. నిరంజనుడు ఉత్సాహంతో మిత్రునివెంట బయలుదేరాడు.

సోమశేఖరదత్తు నిరంజనుని చూచినాడు; శారదయు జూచినది. నిరంజనుని రూపురేఖలు, నమ్రత గమనించారు. శారదకు వెంటనే ఒక ఆలోచన కలిగింది. అందుచే ఆమె "నిరంజనునితో కొంచెము మాటాడవలసి యున్నది" అని తన కోరికను తెలియపరచెను. అందుకు అందరూ సమ్మతించిరి. వారిద్దరూ ఒక గదిలోనికి పోయిరి. ఒక అరగంట సేపటికే వారిద్దరూ మంద హాసంతో బయటకు వచ్చారు. నిరంజనుడు గది నుండి బయటకురాగానే విశ్వదత్తని జూచి "మిత్రమా! శారద ద్వారా నాకు అన్ని విషయాలు తెలిశాయి. తద్వారా, ఈమె నాకు చెల్లెలు అయినది. చెల్లెలిని పొందువాడు ఎందైనా ఉంటాడా? మరియు ఇంకొక శుభవార్త ఈ నా చెల్లెలు నిన్ను పరిణయమాడగోరుచున్నది. నా చెల్లెలిని సకల విద్యా విశారదుడవగు నీకు యిచ్చి వివాహము జరిపించుటకంటే నాకు ఆనంద మింకొకటి ఏది యుండును? నా కొర్కెమన్నించి నీ మిత్ర ధర్మమును నిల్పు"మని ప్రార్ధించెను.

విశ్వదత్తుడు జరిగినది గ్రహించెను. "శారద సత్యమును వెల్లడించి- నిరంజనుని మనస్సును మార్పించెనని" గ్రహించెను. తరువాత కొద్ది రోజులకే "శారదా-విశ్వదత్తుల కళ్యాణము జరిగినది."

"మహారాజా: వింటివిగదా కథ" ఇందు ఎవరి త్యాగము ఘనమైనది;" అని భేతాళుడు విక్రమార్కుని ప్రశ్నించెను.

విక్రమార్కుడు రెండు నిమిషములాలోచించి "భేతాళా! సోమశేఖర దత్త గృహయజమాని, అతని మాటకు ఆ యింట తిరుగులేదు. మరియు తన చెల్లెలికి వాగ్దానము గావించినవాడు. విశ్వదత్తుని అల్లునిగా పొందుటకు అన్ని విద్యలు నేర్పించినవాడు. అట్టివాడు మేనల్లుని కోరికపై ముక్కు మొహం ఏరుగని నిరంజనునికి తన ఏకైక పుత్రికను ఇచ్చుటకు సమ్మతించినాడు. కావున ఆతని త్యాగమే చాల ఘనమైనది" అని సమాధాన మిచ్చినాడు, వెంటనే నియమభంగ మగుటచే తిరిగి భేతాళుడు యెగిరి వృక్షము పైకి చేరుకొన్నాడు. విక్రమార్కుడు మురల విసుగుచెందక-వృక్షము దిక్కు బయలు దేరాడు.

విక్రమార్కుడు వృక్షమును సమీపించి, భేతాళుని బంధించాడు. భుజముపై వేసికొని ఆశ్రమానికి బయలుదేరాడు. తప్పించుకొను మార్గము నెరింగిన భేతాళుడు మరల యింకొక కథ ప్రారంభించాడు.