శ్రీ మార్కండేయ మహర్షి (పురాణగాథలు)



మృకండుమహర్షి తన భార్య మరుధ్వతితో కలిసి ఒక అరణ్యంలో సాత్త్వికజీవనం గడుపుతున్నాడు. ఆ దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు కావాలని ఆ మహర్షి శివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు శోభాయమానంగా తన భక్తుడికి దర్శనం ఇచ్చాడు.

వత్సా! నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నీకు ఏమి కావాలో కోరుకో. తప్పక అనుగ్రహిస్తాను అని శివుడు మృకండునికి చెప్పాడు. ప్రభూ! మీకు తెలియనిదేముంది. అయినా అడిగారు కావున చెపుతాను. నాకు పిల్లలు లేరు. నాకొక కుమారుడు కలిగేటట్లు వరం ప్రసాదించండి అని మృకండుడు తన కోరిక తెలిపాడు.

మృకండా! నీకోరిక తప్పక నెరవేరుస్తాను. గుణవంతుడు, పుణ్యాత్ముడు, జ్ఞానియై పదునారు సంవత్సరాలు మాత్రమే జీవించే అల్పాయుష్కుడు కావాలా లేక గుణహీనుడు, పాపి, అజ్ఞానియైన దీర్ఘాయుష్కుడు కావాలా? ఈ ఇద్దరిలోను ఎటువంటి కుమారుడు కావాలో నువ్వే నిర్ణయించుకొని చెప్పు అని పరమశివుడు మృకండునికి చెప్పాడు.

మృకండుడు ఒక్క క్షణం కూడా తడబడకుండా అల్పాయుష్కుడైనా సరే సన్మార్గంలో నడిచే విజ్ఞానవంతుడు, అందరి మన్ననలు పొందగలిగే వివేకవంతుడు, నాకు గౌరవాన్ని తీసుకు వచ్చే బుద్ధిమంతుడు అయిన కుమారుణ్ణి ప్రసాదించండి అని తన ఎంపికను తెలియపరిచాడు. శంకరుడు భక్తుడు కోరిన వరం ప్రసాదించి నిష్క్రమించాడు.

కొంత కాలానికి శివుని వరప్రసాదం వలన మరుధ్వతి గర్భం ధరించింది. నెలలు నిండాక ఒక చక్కటి బాలుడికి జన్మనిచ్చింది. ఆ దంపతులు బాలుడికి ‘మార్కండేయుడు’ అని నామకరణం చేశారు. మార్కండేయునికి అయిదు సంవత్సరాల వయస్సులో విద్యాభ్యాసానికి గురుకులంలో చేర్చారు. చిన్న వయస్సులోనే మార్కండేయుడు వేదాలు, శాస్త్రాలలో ప్రావీణ్యత సంపాదించాడు. అందరితో స్నేహభావంతో మెలిగేవాడు. అతడు తన మంచి ప్రవర్తనతో గురుకులంలోని అందరి మన్ననలు పొందాడు. అందరూ మార్కండేయుడంటే ఇష్టపడేవారు.

మార్కండేయుడికి పన్నెండు సంవత్సరాల వయస్సులో తల్లితండ్రులు శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు. గాయత్రి మంత్రం ఉపదేశించారు. ఆ బాలుడు నిత్యం త్రిసంధ్యలలో సంధ్యావందనం నిర్వర్తించేవాడు. బాలుడు పెరుగుతున్నకొద్దీ భయం పెరగసాగింది. కొడుకును చూసినప్పుడల్లా అతని అల్పాయుష్షు సంగతి గుర్తుకు వచ్చి మృకండు మరుధ్వతులకు గుండెలు పిండేసే అంత బాధ కలిగేది. కాని తమ బాధని మర్కండేయుడికి తెలియకుండా జాగ్రత్తపడేవారు.

మార్కండేయుడికి పదిహేను సంవత్సరాలు పూర్తై పదహారవ సంవత్సరంలో అడుగు పెట్టాడు. ఒకనాడు మహర్షి ఆయన భార్య దుఃఖాన్ని ఆపుకోలేక మార్కండేయుడి ఎదుటనే రోధించడం మొదలు పెట్టారు. ఎన్నడూ లేనిది తల్లితండ్రులు ఇలా దుఃఖించడం చూసిన మార్కండేయుడు వారి దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు. కన్నీరు కార్చుతూ మృకండు కుమారుడికి శివుని వరం గురించి వివరించాడు.

మార్కండేయుడు తల్లితండ్రులతో చావు పుట్టుకలు శివాధీనమనీ, వివేకవంతులు మరణం గురించి ఆలోచించరని చెప్పి వారిని ఓదార్చాడు. మరునాడు మార్కండేయడు తల్లితండ్రుల వద్దకు వచ్చి పాదాభివందనం చేసి నేను మరణాన్ని జయించడానికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. మహాశివుని గూర్చి ఘోరమైన తపస్సు చేయ తలపెట్టాను. నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు. వారు మార్కండేయుని దీవించి తపస్సు చేయడానికి అనుజ్ఞ ఇచ్చి వీడ్కోలు పలికారు.

మార్కండేయుడు ఒక నిర్జన ప్రదేశంలో నిద్రాహారాలు మాని తపస్సు మొదలు పెట్టాడు. మార్కండేయుని పదహారవ ఏడు పూర్తికావస్తోంది. మార్కండేయుని మరణ సమయం దగ్గర పడడంతో యమధర్మరాజు అతని ప్రాణాలు తెచ్చేందుకు తన బటులను పంపాడు. వారు ఎంత ప్రయత్నించినా తపోదీక్షలో ఉన్నమార్కండేయుడి సమీపానికి వెళ్ళలేకపోయారు. వారు తిరిగి యమలోకం వచ్చి ఆ సంగతి యమునికి తెలియపరిచారు.

తన బటుల ద్వారా విషయం విన్న యమధర్మరాజు యమదండం పట్టుకొని స్వయంగా తన వాహనంపై మార్కండేయుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. మార్కండేయుని నిరుపమానమైన శివభక్తి వలన మరియు అతను చేసే తపోమహిమ వలన, ఎప్పుడూ ఏ మానవ నేత్రాలకు కనపడని యమధర్మరాజు ఈ సారి అక్కడ తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు.

మార్కడేయుని ప్రాణాలు తీసుకోవడానికి యముడు అతనిపై యమదండాన్ని ప్రయోగించాడు. మార్కండేయుడు తన ముందున్న శివలింగాన్ని పట్టుకొని ఆగకుండా శివనామం జపిస్తూ ఉన్నాడు. యముడు వదిలిన యమదండం, మార్కండేయుని మెడకు అతని ముందున్న శివలింగానికి కలిపి చుట్టుకుంది. ఒక్కసారిగా శివలింగం నిలువుగా చీలింది. ఆ చీలికల మధ్య నుండి చేత త్రిశూలం ధరించిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. రుద్రుడు యముణ్ణి పక్కకు తోసి మార్కండేయుణ్ణి రక్షించాడు. త్రిశూలంతో పొడిచి యమధర్మరాజును సంహరించాడు. ఆ రోజు నుండి మార్కండేయునికి మృత్యుంజయ, కాలకాల అనే పేర్లు వచ్చాయి.

దేవతలందరి ప్రార్థనతో శివుడు కనికరించి యమధర్మరాజుకు ప్రాణదానం చేసాడు. తన భక్తుడైన మార్కండేయుని తపస్సుకు మెచ్చిన సదాశివుడు అతనికి చావులేకుండా వరం ఇచ్చాడు. “నీ కోరికలన్నీ తీరుతాయి. నీకు ఎప్పటికీ రోగము, ముసలితనము, చావు రావు. నీవు ఈ ప్రపంచం ఉన్నంతవరకూ బుద్ధిశాలివై అందరి మన్ననలు పొందుతూ ఉంటావు” అని దీవించాడు. పరమశివుని వరం వలన చిరంజీవి అయిన మార్కండేయుడు లోకకల్యాణార్థమై హిమాలయ ప్రాంతాల్లో తపస్సు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు.

ఇది జరిగిన చాలా సంవత్సరాల తరువాత యుగాంతంలో ప్రళయం వచ్చింది. ఆ ప్రళయ ప్రభావం వలన భూలోకం అంతా అంధకారంలో మునిగిపోయింది. సూర్యచంద్రులు మాయం అయ్యారు. ఉల్కలూ తోకచుక్కలు తగిలి పర్వతాలు పిండయిపోయాయి. చెట్టులు పుట్టలు ఏకమయ్యాయి. అంతరిక్షదూళితో నక్షత్రాలు కనుమరుగయ్యాయి. నదులు, చెరువులు ఎండిపోయాయి. భూలోకం అంతా అగ్ని ప్రజ్వలిల్లింది. ఆ మంటలు భూలోకం క్రిందనున్న పాతాళలోకానికి కూడా చేరాయి. జీవులన్నీ ఆ మంటలకు ఆహుతయ్యాయి. దేవదానవులకు కూడా విపరీతమైన నష్టం కలిగింది.

ఆ సమయంలో మార్కండేయ మహర్షి విష్ణు నామాన్ని జపిస్తూ తపస్సమాధిలో ఉన్నాడు. మహర్షి తపోమహిమ వలన ఆ మంటలు ఆయన దగ్గరకు చేరలేకపోయాయి. కాని ఆయనను చుట్టిన మంటల వేడికి కళ్ళు తెరిచిన మహర్షి తన తపస్సు గురించి మరచిపోయాడు. తపస్సుకు ఆటంకం రాగానే ఆకలి దప్పికలు మొదలయ్యాయి. చుట్టూ చూసి తృళ్ళిపడి లేచి నిలబడ్డాడు. కనుచూపుమేరలో చుట్టూ మంటలు తప్ప మరేమీ కానరాలేదు. భయంతో మార్కండేయుని పెదవులు, గొంతు ఎండిపోయాయి. దాహం తీర్చుకోవడానికి నీళ్ళకొరకు వెదకసాగాడు.

మహర్షికి దూరంలో ఒక పెద్ద వటవృక్షం కనపడింది. ఈ మంటల మధ్య ఆ చెట్టు కాలకుండా ఎలా మిగిలి ఉందా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే అటు కదిలాడు. మంటలు మహర్షికి దారి ఇచ్చాయి. ఆ చెట్టు నీడకు చేరిన మార్కండేయ మహర్షి విష్ణు నామాన్ని జపిస్తూ మరల తపస్సులో మునిగిపోయాడు. ఆకాశంలో దట్టమైన కారుమేఘాలు కమ్ముకున్నాయి. సన్నగా వర్షం మొదలై కొద్ది కొద్దిగా పెరుగుతూ కుండపోత వర్షంగా మారింది. భూమి అంతా ఎటు చూసినా జలమయమయ్యింది. వర్షం నీటివల్ల మంటలన్నీ ఆరిపోయాయి. అలా పన్నెండు సంవత్సరాలు వర్షం కురిసింది. భూమి అంతా ఒక మహా సముద్రంగా మారిపోయింది. అయినా సరే మహర్షి తపస్సు ఆపలేదు.

శ్రీహరి అదృశ్యరూపంలో మార్కండేయునితో “వత్సా నీవు భయపడకు. నిన్ను నేను రక్షిస్తాను” అన్నాడు. అలా పలికింది విష్ణుభగవానుడు అని గ్రహించని మహర్షి “ఎవడివిరా నువ్వు! కండకావరంతో నాకే ధైర్యం చెపుతున్నావు? నేనేమి పిల్లవాడిని కాదు. స్వయంగా పరమశివునితో దీవెనలు పొందిన మార్కండేయ మహర్షిని” అని కోపంతో పలికాడు. కాని ఎటు చూసినా ఎవరూ కనపడకపోవడంతో ‘ఈ మాటలు ఎక్కడినుండి వచ్చాయి? నిజంగా ఎవరైనా పిలిచారా, లేక నేను బ్రమ పడ్డానా?’ అని అనుకున్నాడు. మరల విష్ణునామ జపం మొదలుపెట్టాడు.

కాస్సేపటి తరువాత ఆ వటవృక్షం నీటిలో తేలడం చూసాడు. ఆ చెట్టు కొమ్మలపైన ఒక బంగారు పరుపు పరచబడి ఉంది. దానిపైన ఒక బాలుడు శయనించి ఉన్నాడు. ఆ ప్రళయ సముద్రంలో తేలియున్న వటవృక్షంపై చిన్న బాలుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. మహర్షి ఆ సమయంలో తన ఎదుట ఉన్న బాలుడు విష్ణుమూర్తి తప్ప మరెవ్వరూ కాదని తెలుసుకోలేక పోయాడు. ఆ బాలుడు మహర్షితో “ఈ ప్రళయం వలన నువ్వు అలసిపోయి ఉన్నావు. వచ్చి కాస్సేపు నా కడుపులో సేదతీరు” అని ఆహ్వానించాడు.

మహర్షి ఆ మాటలు జీర్ణించుకోక ముందే బాలుని నోటి ద్వారా గర్భంలో చేరాడు. ఆ బాలుని ఉదరంలో సమస్త లోకాలు, ద్వీపాలు,సముద్రాలు, కొండలు, రాజ్యాలు, ప్రాణులు కనపడ్డారు. విష్ణుమాయను గ్రహించిన మార్కండేయుడు శ్రీహరిని స్తుతించసాగాడు. మరుక్షణంలో మహర్షి బాలుని నోటి నుండి బయటపడ్డాడు. విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరించి మహర్షిని దీవించాడు. మహర్షి వేయి సంవత్సరాలు శ్రీహరి సాన్నిధ్యంలో గడిపాడు.

ఒకనాడు విష్ణువు మార్కండేయునితో ‘నీకొక వరం ఇవ్వాలనినిశ్చయించుకున్నాను. ఏమి కావాలో కోరుకో’ అని అన్నాడు. దానికి మహర్షి “స్వామీ! నాకు పురుషోత్తమ క్షేత్రంలో ఒక శివాలయం నిర్మించాలని ఉంది. దీనితో ప్రజలందరికీ శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒక్కటే అనే సంగతి తేటతెల్లమవుతుంది” అని తన మనస్సులోకి మాటను విన్నవించాడు. శ్రీహరి ‘తథాస్తు’ అని మహర్షి అడిగిన వరాన్ని ప్రసాదించాడు.

మార్కండేయ మహర్షి “త్రిభువనేశ్వర” నామంతో శివలింగాన్ని ఉత్కళదేశంలోని పురుషోత్తమ క్షేత్రంలో ప్రతిష్టించి ఆలయాన్నినిర్మించాడు. ప్రస్తుత పూరీ నగరంలోని జగన్నాథ దేవాలయానికి ఉత్తరంలో మార్కండేయ సరస్సు వద్ద ఈ శివాలయం ఉంది.

మార్కండేయుడు అల్పాయుషుస్కుడుగా పుట్టినా, తన భక్తి సాధనతో శివ కేశవులను మెప్పించి చిరంజీవి అయ్యాడు. ఈ భూలోకం ఉన్నంత వరకు మానవ కల్యాణం కొరకు తపోజీవనం సాగిస్తూ ఉంటాడు.