స్వార్ధం


రవి శుభలేఖను రాము చేతికిచ్చి "రామూ! నా ఇద్దరి చెల్లెల్లకి పెళ్ళి చేస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి" అని చెప్పాడు. "మరి నీ పెళ్ళెప్పుడోయ్!" నవ్వుతూ అడిగాడు రాము. "నా చెల్లెల్లకు పెళ్ళి తతంగం పూర్తి అయిన వెంటనే నా పెళ్లికి ప్రయత్నాలు చేస్తాను" చెప్పాడు రవి
రాము సంతోషిస్తూ "పాతికేళ్ళు దాటుతున్నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాతే పెళ్ళి చేసుకోవాలన్న నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నా రవీ!" అన్నాడు. "అభినందించదగ్గ గొప్ప పనేం చేయటం లేదు. వారికి పెళ్ళిళ్ళు చేయడంలో కొంత నా స్వార్ధం కూడా వుంది" అన్నాడు రవి. రాము ఆశ్చర్యపడి "స్వార్ధమా. ఏమిటది?" అనడిగాడు.
"ఔను. స్వార్ధమే! నాకు పిల్లనిన్వటానికి వచ్చిన వారిలో కొందరు మా అమ్మాయికి అత్తగారి సాధింపులేగాక ఆడబిడ్డల ఈసడింపులు కూడా వుంటాయి. మీ ఇంట్లో మా అమ్మాయి. ఇనుడలేదు బాబూ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు ఇంకొందరు మేము మా అమ్మాయికి కట్నం ఇస్తే ఆ కట్నం డబ్బులతోనే ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళి చేస్తావు. అప్పుడు మా అమ్మాయి గతేం.కావాలి. కట్నం తీసుకోకుండా చేసుకుంటావేమో పెళ్ళి చేసుకో. అమ్మాయి నిస్తామంతే. అని ముఖంమీదే తెగేసి చెప్పారు.
నాకు కట్నం ఇచ్చి పిల్లనివ్వాలంటే మా ఇంట్లో నా చెల్లెళ్ళు. వుండకూడదు. అందుకే వారికి ముందుగా పెళ్ళి చేస్తున్నాను" అని అసలు విషయం చెప్పాడు రవి .
అంతా విన్న రాము "నీలో ఇంత స్వార్ధముందా?" అని నోరెళ్ళబెట్టాడు.