తీర్ధ మహిమ



ధర్మరాజు అర్జుని కోసం నిరీక్షిస్తున్న సమయంలో అతని వద్దకు నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు నారదునికి అతిథి మర్యాద చేసాడు. ఆ యనను చూసి ధర్మరాజు " మునీంద్రా నాకు ఒక ధర్మ సందేహం ఉంది. తీర్చగలరా ?" అని అడిగాడు. నారదుడు నవ్వి అలాగే అడగమన్నాడు. ధర్మరాజు " ఈ భూమిలో తీర్ధములు సేవించిన ధన్యులకు ఎలాంటి ఫలితం కలుగుతాయి " అని నారదుని అడిగాడు.

నారదుడు ధర్మరాజా చెబుతాను విను " పూర్వం భీష్ముడు గంగాతీరంలో వేదాధ్యనం చేస్తూ చాలా మంచి పనులు చేసూ ఉండేవాడు. భీష్ముని వద్దకు ఒక సారి పులస్త్యుడు అనే ముని వచ్చాడు. అతనికి అతిధి మర్యాదలు చేసిన పిమ్మట భీష్ముడు పులస్త్యుని చూసి నీవు నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ మహర్షి భీష్మునితో చెప్పిన విషయాలు నీకు చెప్తాను ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్నవారు, దృఢమైన మనసు కలిగినవారు, అహంకారం లేని వారు, ఇతరుల నుండి ఏమీ ఆశించని వారు మిత భోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది.

మలిన మనస్కులు, పాపాత్ములు ఎన్ని తీర్ధాలు చేసినా ఫలితం శూన్యం. దాన ధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులు అవుతారు. అలాంటి వారు దరిద్రులు యజ్ఞములు చేయలేరు. కనుక పుణ్య తీర్ధములు చేసి పుణ్యం పొందవచ్చు. సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్థం ప్రసిద్ధమైంది. దానిలో స్నానమాచరించిన పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పుష్కరంలో పది సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.

జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసిన ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యం, యయాతి పతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్థం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నానం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది.

వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నానం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్థంలో శివుని పూజించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివిని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్థం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్థంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది.

శివుడు నివసించే దేవికా క్షేత్రాన్ని, కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్థం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్రకోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్థం, పుష్కర తీర్థం అనేవి మూడు పవిత్ర క్షేత్రాలు.

కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉంది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానంలో విష్ణుమూర్తిని పూజించినా, పారిప్లవ తీర్థంలో, శాలుకినీ తీర్థంలో, సర్పతీర్థంలో, వరాహతీర్థంలో, అశ్వినీ తీర్థంలో, జయంతిలో ఉండే సోమతీర్థంలో, కృతశౌచ తీర్థంలో స్నానమాచరించిన ఎంతో పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అగ్నివట క్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా యక్షిణీ తీర్థంలో స్నానం చేసినా కామ్యసిద్ధి కలుగుతుంది.

"ధర్మజా! జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజులను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచకం పవిత్రత సంతరించుకోవాలి అని కోరాడు.

అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభనం, శంఖినీ తీర్థం, యక్షేంద్రతీర్థం, సరస్వతీ నది, మాతృతీర్థం, బ్రహ్మావర్తం, శరవణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్థం, ఆపగ నదీ తీర్థం, సప్తఋషి కుండం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి . నారద నిర్మిత అంబాజన్మం అనే తీర్థంలో చనిపోతే పుణ్య లోకాలకు పోతారు.

పుండరీకం అనే తీర్థంలో ఉన్న వైతరణిలో స్నానమాడినా, ఫలకీ వనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీనది, దృషద్వతీ నదీ సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. కిందర్త తీర్థంలో తిలోదానం చేస్తే పితృ ఋణం తీరితుంది. అహస్సు, సుదినం, అనే తీర్ధాలలో స్నామాచరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నానమాచరించి శివుని ఆరాధించిన అశ్వమేధ ఫలం కలుగుతుంది. వామన తీర్థంలో స్నానం చేస్తే విష్ణు లోకానికి పోతారు.

పావన తీర్థంలో స్నానమాచరించిన వంశం పవిత్రమౌతుంది. శ్రీకుంజంలో తీర్ధాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. సప్తసారస్వతాలు అనే తీర్థంలో స్నానంచేస్తే సమగ్ర సారస్వతప్రాప్తి కులుగుతుంది. ఔశనశం, కపాలమోచనం, విశ్వా మిత్రం, కార్తికేయం అనే తీర్ధాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులౌతారు. పృధూక తీర్థంలో చనిపోతే పాపాల నుండి విముక్తులౌతారు. గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.

శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్థంలో స్నానం చేస్తే సర్వ దుఃఖ విముక్తి కలుగుతుంది. స్వస్తి పురం అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్థంలో ఉపవాసం చేస్తే స్త్యలోకం సిద్ధిస్తుంది. ఆ దిత్యాశ్రమంలో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. దధీచి తీర్థంలో మూడురాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

స్యర్యగ్రహణ సమయంలో సన్నిహిత తీర్థంలోస్నానం చేస్తే నూరు అశ్వమేధాలు చేసిన ఫలం పొందుతారు. ధర్మతీర్థంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్ధాలలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి. సరస్వతీ హ్రదం నుండి వచ్చే జలంలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం వస్తుంది. శాకంబరీ తీర్థంలో ఒకరోజు శాకాహార తపస్సు చేస్తే పణ్యం లభిస్తుంది. ధూమావతీ, రథావర్తం అనే తీర్ధాలలో స్నానం చేస్తే దుఃఖం నుండి విముక్తులౌతారు.

అందరూ పుణ్య తీర్ధాలలో స్నానం చేయలేరు. నోములు నోచని వారు, చెడ్డవారు, ఉపవాసాలు చేయని వారు, శుచిత్వం లేని వారు తీర్ధయాత్రలు చేయలేరు. కనుక నీవు తీర్ధ యాత్రలకు వెళ్ళి రమ్ము. రోమశుడు అనే మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను తీర్ధయాత్రలు చెయ్యమని ఆదేశిస్తాడు.

నీవు ధౌమ్యుని అనుమతితో తీర్ధయాత్రలు చేసి రా " అని చెప్పి నారదుడు వెళ్ళాడు.