తెనాలి రామకృష్ణుడి తీర్థం (లింగడి తీర్థం )

ఆకాలంలో తెనాలిలో ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వరాలయంలో కొలువు తీరిన రామలింగేశ్వరస్వామి వారిని.

ఆ ఊరివాళ్లే కాక చుట్టుప్రక్కల గ్రామాలతోపాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో వచ్చి స్వామివారికి అభిషేకాదులు జరిపించి తమ మొక్కుబడులు తీర్చుకునేవారు. ఆలయ పూజారి శంకరశాస్త్రి గుడిని, లింగాన్ని మింగేసే రకం. ఆలయ గర్భగుడిలో శివలింగం సన్నిధిలో మాత్రం దీపపు ప్రమిద వుంచి ఆలయం అంతా చీకటిగా వుంచేవాడు.భక్తులు అభిషేకం నిమిత్తం తెచ్చిన పాలని ఆ చీకట్లో ఉంచిన గంగాళంలో పోసి ఆ తర్వాత రహస్యంగా పాలు అమ్ముకునేవాడు.కొబ్బరికాయలు కొట్టకుండానే కొట్టినట్లు చప్పుళ్లు చేసి ఒక కాయని ఇద్దరికి పంచి మరోకాయ తర్వాత అమ్ముకునేవాడు.అభిషేక ద్రవ్యాలు తేనె, ఫలరసాలు, పెరుగు, పన్నీరు అన్నీ స్వాహా చేసేవాడు. ఆలయమంతా చీకటిమయం చేసి ఆ చీకటిమాటున తన అవినీతిని కొనసాగించేవాడు.’ఆలయంలో దీపాలెందుకు పెట్టలేదని?’ ఎవరైనా అడిగితే “లింగడు తేజోమయుడు. చీకట్లో ఆ తేజస్సుని దర్శిస్తేనే పుణ్యం. స్వామివారి సన్నిధిలో ఒక్క దీపం వుంచడం వల్లనే గదా, ఆ లింగడి మీదనే భక్తుల చిత్తం నిలుస్తోంది” అంటూ బుకాయించి అడిగిన వాళ్ల నోళ్లు మూయించేవాడు.

‘పుట్టిన శిశువుకి నెలతిరిగే లోపున దైవదర్శనం చేయించాలి’ అన్న ఆచారాన్ని పాటిస్తూ రామన్నగారు ఆయన అర్థాంగి తమ కొడుకుని శివాలయానికి తీసుకొచ్చారు.

రామన్నగారే ఆ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త. పూజారి పెద్దపెట్టున నమకం చమకం చదువుతూ అభిషేకం చేశాడు. అంతలో రామన్నగారి బావమరిది, “అయ్యా శాస్త్రిగారూ! లింగడి తీర్థాన్ని యిస్తారా?” అనడిగాడు.“ఇదిగో, వచ్చే వచ్చే….” అంటూ శంకరశాస్త్రి అభిషేకతీర్థం పాత్రతో హడావిడిగా వచ్చి అలవాటు ప్రకారం “అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారకం, సమస్త పాపక్షయకరం, శ్రీరామలింగేశ్వర స్వామి పాదతీర్థం పావనం, శుభం…” అని మంత్రాన్ని బిగ్గరగా చదువుతూ పాత్రలో ఉద్దరిణి కోసం వెతుక్కోసాగాడు.

మూడుసార్లూ యథాలాపంగా మంత్రం పూర్తయింది. తీర్థం స్వీకరించిన బావమర్ధిగారు తన్మయత్వం చెందుతూ “పూజారిగారూ! తీర్థం ఎప్పుడూ లేనంత దివ్యంగా ఉంది” అన్నాడు. “.తీర్ధమా? నేనింకా పొయ్యందే… ఉద్ధరిణ కనపడక ఛస్తున్నాను” అన్నాడు పూజారి.

“అయితే… నా చేతిలో తీర్థం పోసిందెవరు?” అని బావమర్ధిగారు అంటుంటే, పూజారి గభాల్న గర్భగుడిలోకి వెళ్లి లింగడి ముందు దీపపు వత్తిని పెద్దది చేసి దీపాన్ని వారివైపు తిప్పుతూ “ఇదిగో… ఉద్దరిణ యిక్కడే ఉంది” అన్నాడు. ఆ దీపపు కాంతిలో అప్పుడే బావమర్ధిగారి నెత్తిన ‘రయ్యి”‘మని ‘అభిషేకజలం’ పడింది. ఆయన చప్పున అటు తలతిప్పి చూసి “హార్నీ, రామలింగా! యీ తీర్థం నీదా?” అంటూ విస్తుబోయాడు.తల్లి పొత్తిళ్లలో వున్న నెలబిడ్డ రామలింగడు బద్దకంగా ఒళ్లు విరుచుకుంటూ మళ్లీ రయ్యి… రయ్యి… మంటూ మూత్రం విసర్జించాడు.సరిగ్గా అప్పుడే రామన్నగారి దృష్టి గర్భాలయంలో వున్న పాత్రల్లోని అభిషేక ద్రవ్యాల మీద పడింది.

ఆయన జరుగుతున్న మోసాన్ని గ్రహించి పూజారివైపు ఆగ్రహంగా చూస్తూ, “ఇదా, నీ నిర్వాకం?” అన్నారు. పూజారి గడగడ వణుకుతూ ఆయన కాళ్లమీద పడి తప్పుకాయమన్నాడు. రామన్నగారి బావమర్ధి పకపకా నవ్వి మేనల్లుడిని ప్రశంసిస్తూ “బావా… మన లింగడు… తీర్థం పోస్తే పోశాడుగానీ రామలింగడికి జరుగుతున్న ద్రోహాన్ని బట్టబయలు చేశాడు కదా…” అన్నాడు.

“లింగడా… మజాకానా?” అన్నారెవరో… అంతే అన్నవాళ్ల నెత్తిన ‘అభిషేకం’ వర్షించాడు లింగడు. అందరూ పకపకా నవ్వారు.