తెనాలి రామకృష్ణ నామము

అనగనగనగా…. షుమారు 500 సంవత్సరాలక్రితం ఆంధ్రదేశంలో కృష్ణాతీరం తెనాలి అగ్రహారంలో, నియోగి బ్రాహ్మణుడు, కౌండిన్యస గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న, ఆయన ధర్మపత్ని లక్ష్మమాంబ దంపతులకి లేకలేక ఒక మగపిల్లవాడు కలిగాడు. పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడి జననకాల లగ్నాన్ని పరీక్షించి “ఆఁహా! వీడు మహర్జాతకుడు. కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడెయ్యగల సమర్థుడు. రాముడిలా మాట తప్పనివాడు, కృష్ణుడిలా మనసెరిగినవాడు అవుతాడు” అన్నాడు.

“అయితే, యింకేం… ‘రామకృష్ణ’ అని పేరుపెట్టండి” అన్నారెవరో. రామన్నగారు తల పంకించి “మా ముత్తాతగారి పేరు అదే” అన్నాడు, కొడుక్కి ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడైపోతూ. అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకొని “మన గణపతిశాస్త్రులు వారేదో సంకోచిస్తున్నట్లున్నారు” అన్నాడు.

“ఇందులో సందేహించడానికేముంది, నా బొంద. ఈ జాతకుడు మహర్జాతకుడే కానీ… రాముడిలా మాటిస్తూనే దాన్ని ‘ఎలా తప్పించుకుందామా’ అని ఆలోచించే రకం. కృష్ణుడిలా అందరి మన్ననలు పొందుతూనే గండాల పాలవుతుంటాడు. తానెంత సంపాదించినా తనకోసం ఏమీ దాచుకోని భోళాశంకరుడు.

ఘనుడు, ఘటికుడే గానీ…. ‘లింగడు’…. దోసెడు నీళ్లు, చిటికెడు భస్మంతో సంతృప్తి చెందే ‘రామలింగడు’…” అన్నాడు గణపతిశాస్త్రుల వారు. వెంటే యింకో బంధువు కల్పించుకొని “ఇకనే… ‘రామలింగడు’ అని పేరు పెట్టండి” అనేశాడు. రామన్నగారి అర్థాంగి, బాలుడి తల్లి, బాలింతరాలైన లక్ష్మమాంబ ముసిముసిగా నవ్వి “మా ముత్తాతగారి తండ్రిపేరు రామలింగడు…” అంది.

వెంటనే “అయ్యా, రామన్నగారూ! సుముహూర్తం దాటిపోతోంది. పిల్లవాడి పేరు ఏమిటో నిర్ణయించండి మరి. రామకృష్ణుడా? రామలింగడా?” అని అడిగాడు బారసాల కార్యక్రమం జరిపిస్తున్న పురోహితుడు.

“ఇందాకే మా అన్నయ్య చెప్పాడు కదా…. రామకృష్ణ అని… ఏం అన్నయ్యా…?” అని రామన్నగారి చెల్లెలు, ఇంటి ఆడపడుచు “అదెట్లా వీలవుతుంది? ఏం బావా? మా చెల్లెలు కాపురానికొచ్చిన యిన్నేళ్లకి ఒక్క కోరిక కోరింది. అది తీర్చలేవా? ‘రామలింగడు’ పేరు పెట్టాల్సిందే” అన్నాడు పిల్లవాడి మేనమామ, లక్ష్మమాంబ అన్న ఖరాకండిగా.

త్వరగా చెప్పండి. రామకృష్ణుడా? రామలింగడా?” తొందరజేశాడు పురోహితుడు. గార్లపాటి రామన్నగారికి చిరాకెత్తుకొచ్చి “ఎవరికిష్టం వచ్చిన పేరుతో వాళ్లు పిల్చుకోండి. ఈ తిక్క వెధవకి నేను పేరు పెట్టేంతటి వాడా?” అని అరుస్తూ లేచి వెళ్లిపోయాడు.

తనపేరు ‘రామకృష్ణుడా?… రామలింగడా?’ అన్న సందిగ్ధాన్ని బారసాలనాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన ‘వికటకవి’ తెనాలి రామకృష్ణ. బారసాలనాడే తల్లికి-తండ్రికి మధ్య ‘తగువు’ కల్పించిన అతడి జీవితమంతా వినోదాత్మకం. విజ్ఞానాత్మకం. వివాదాత్మకం. ఐనా ప్రతి విషయం సుఖాంతం, సుభాంతం. అందుకే తెనాలి రామకృష్ణ కథలు లోకప్రసిద్ధాలయ్యాయి. తన జీవిత సంఘటనలనే దేశప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి, కాళికాదేవి ముద్దుబిడ్డడు తెనాలి రామకృష్ణ.