విద్యాసాగరుని వివాహములు



ఈ విధముగా విద్యాసాగరుడు శాస్త్రప్రమాణముగా, తన బ్రాహ్మణత్వమునకు భంగం రాకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యకలను భార్యలుగా పొందినాడు.

కాలక్రమమున విద్యాసాగరుడు - బ్రాహ్మణ కన్యకయందు “వరరుచి" యను కుమారుని; రాజపుత్రిక వలన "విక్రమార్కుడు" అను కుమారుని, వైశ్య కన్యక యందు "భట్టి" యను కుమారుని, చంద్రరేఖ వలన "భర్తృహరి" యను పుత్రుని కలిగినాడు.

క్రమముగా పిల్లలు నలుగురు దినదిన ప్రవర్ధమానులై యుక్తవయస్సు గలవారైరి. అన్ని విద్యలలోను ప్రవీణులయినారు. మహారాజు అగు చంద్రగుప్త ఆదిత్యుడు ముసలివాడగుటచే అల్లునికి రాజ్యమప్పగించి తపస్సు చేసుకొనుటకై ఆడవులకు వెళ్ళిపోయాడు.

విద్యాసాగరుడు రాజ్యభారము వహింపక క్షత్రియ కుమారుడు, చంద్రగుప్త ఆదిత్యుని మనునుడగు విక్రమార్కునికి పట్టాభిషేకం చేశాడు. "విక్రమార్క ఆదిత్యుడు" అను బిరుదుతో విక్రమార్కుడు "మహారాజు" అయ్యాడు.

"వరరుచి" మహాపండితుడయ్యాడు. "భట్టి" మహామంత్రి అయాడు. "భర్తృహరి" సైన్యాధిపతి ఆయాడు. ఈతడు తన చివరికాలంలో, భార్య మరణానంతరం విరాగియై-అనేక సుభాషితాలు వ్రాసి, లోకమున ప్రసిద్ధ పురుషుడై నాడు,