విక్రమార్కుడు కాళికాదేవి ఆలయము దర్శించుట



ఆ మార్గము చాల భయంకరంగా ఉంది. క్రూరమృగ సంచారము లోయలు, గుహలు, ముళ్ళపొదలు విశేషముగా ఉంది. అయినా విక్రమార్కుడు. వెనుకంజ వేయలేదు. క్రమముగా ఆ యిరువురు కాళికాదేవాలయం చేరుకొన్నారు.

గూడచారి చెప్పిన దానికన్నా అక్కడ ఆ లోయ (నూయి వంటిది) మహా భయంకరముగా ఉంది. అందుండి అనేక త్రిశూలములు మంచి పదునుగల్గి మిలమిల మెరుస్తూ ఉన్నాయి. వానిమీద పెద్ద మద్ది వృక్షము కొమ్మకు వేలాడుతున్న ఏడు ఇనువ గొలుసులు వ్రేలాడుతూ ఉన్నాయి. ఆ మద్ది వృక్షము ఎక్కిగాని, లేదా క్రిందగల గట్టుపై నుండి ఎగిరిగాని ఆ ఏడు గొలుసులను పట్టుకొని, ఒక్క వేటున ఖండించాలి.

అట్టి సాహనవంతునికి దేవి ప్రత్యక్షమై కోరిన వరములు యిస్తుంది. ఇది సారాంశం. ఖండించిన వెంటనే అతడు తప్పక త్రిశూలములపై పడిపోగలదు. త్రిశూలములు అట్టి వాని శరీరమునుండి దూసుకొని పోగలవు. అయినా విక్రమార్కుడు భయపడలేదు.