విక్రమార్కుడు సన్యాసితో బయలుదేరుట



"మహారాజా: దేశ సౌభాగ్యానికి నేనొక మహాయజ్ఞాన్ని చేయుటకు సంకల్పించుకొన్నాను. అందుకు కావలసినవన్నీ సేకరించుకొన్నాను. ఇచ్చటకు పదికోసుల దూరంనందే ఆ హోమ గుండం ఉన్నది. ఆ ప్రదేశం మిక్కిలి భయంకరమైనది. నాకు సహాయంగా నీవు నిలవాలి. పూర్వం విశ్వామిత్రునకు రాముడు నిల్చి యజ్ఞం పూర్తి చేయించినాడు. ఇప్పుడు నీవు నిల్చి ఆ యజు పూర్తి చేయించుము. దేశ సౌభాగ్యమునకు సహాయపడుము" అని ప్రార్ధించినాడు.

మహాసాహసవంతుడగు విక్రమార్కుడు అతని మాటలకు సమ్మతించి నాడు. "మహాత్మా! దేశసౌభాగ్యానికి నా ప్రాణములనైన ధారపోయగలను. అట్టి నేను మీకు సహాయముగా ఉండలేనా?" అని బదులుచెప్పి తన వీరదండంను ధరించి సన్యాసి వెంట బయలుదేరినాడు. భట్టికి రాజ్యధికారమప్పగించినాడు.

సన్యాసి విక్రమార్కునితో భద్రకాళీ ఆశ్రయంనకు చేరుకొన్నాడు. విక్రమార్కుడు ఆ తల్లిని మనసారా మదిలోనే ప్రార్ధించుకొన్నాడు. సన్యాసి యిలా చెప్పారు.

"మహారాజా! ఇక్కడకు ఆమడ దూరంలోగల అడవిలో ఒక పెద్ద మణివృక్షం ఉంది. అది భూత ప్రేతంలకు నిలయం. దానికి గల ఒక కొమ్మను ఆశ్రయించి భేతాళుడు శవాకారంగా వేలాడుతూ ఉంటాడు. నీవు ధైర్యవంతుడవు. సాహసివి. కావున నీవు భయపడక వెళ్ళి ఆ భేతాళుని (శవాకారమును) తీసికొని రావాలి. అదే మనం చేయబోవుతున్న హోమానికి ముఖ్యంగా కావలసినది" అని భోధించి పంపినాడు. మహారాజు ధైర్యంగా వెళ్ళినాడు. క్రమంగా భేతాళుడున్న ఆ మణివృక్షం చేరుకొన్నాడు విక్రమార్కుడు. భూత ప్రేతములు మహారాజును అనేక విధముల భయపెట్టినవిగాని, వాని మాయలన్నియు మహారాజుముందు మాయమై పోయాయి.

విక్రమార్కుడు భూతముల నోడించి- వెంటనే చెట్టునెక్కి భేతాళ శవాన్ని భుజంపై వేసికొని సన్యాసి ఆశ్రమానికి బయలుదేరాడు. శవాకారంలో ఉన్న భేతాళుడు మహారాజు సాహసానికి ఎంతో మురిసిపోయాడు. "మహారాజా, మనం అమడ దూరం వెళ్ళాలి. నీకు శ్రమలేకుండా ఒక కథ చెబుతాను. ఆలకించి నా సందేహాన్ని నివారించు. నీకు తెలియకపోతే సమాధానం ఇవ్వనక్కరలేదుగాని. తెలిసి, సమాధాన మీయకపోతే నీ తల పగిలి సూరుచెక్కలవుతుంది. ఇది సత్యం-అని యీ విధంగా కథ ప్రారంభించాడు.