విక్రమార్కుడు ఉట్లను ఖండించుట



విక్రమార్కుడు బాగా ఆలోచించాడు. "కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో: ఉట్లు తెగగొట్టిన వెంటనే, అతడు త్రిశూలముపైబడి 'ప్రాణములు గోల్పోవును. అట్టివానికి శ్రీ మాత ఎట్టి వరములు ప్రసాదించును: ఇందు ఏదో మహత్తు ఉండి యుండును. ఏదియైనను భయపడి వెనుకంజ వేయుట చాల నీచమయిన కార్యము. రాచపుట్టుకగల నా వంటి వానికి యీ పిరికితనం మంచిదికాదు" అని నిశ్చయించుకొన్నాడు.

వెంటనే ఖడ్గమును చేత ధరించాడు. దేవికి మనసార నమస్కరించుకొన్నాడు. గట్టుపైకెక్కి ఎగిరి ఆ ఉట్లను అందుకొన్నాడు. ఏడు ఉట్లను వామహస్తములోనికి తీసుకొన్నాడు. దక్షిణ హస్తమునగల ఖడ్గముతో ఒక్క వేటున ఆ ఏడు ఉట్లను ఖండించాడు.

ఇంకే మున్నది: పైన యిక ఏ ఆధారము లేకపోవుటచే విక్రమార్కుడు త్రిశూలముల మీద పడిపోయాడు. కానీ, విక్రమార్కునికి ఆ త్రిశూలములు గ్రుచ్చుకోలేదు. కాళీమాత అదృశ్యరూపముగా దానిపై యుండుటచే.. ఆ దేవి, అలా పడిన విక్రమార్కుని కరముల నెత్తికొని వచ్చి గట్టుపై నిల్చింది. మురిపెముతో ఇలా అన్నది.