విక్రమార్కుడు వేటకు బయలుదేరుట



విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయినీ నగరం మిక్కిలి ఉన్నత స్థితికి వచ్చింది. విక్రమార్కుడు ధర్మము తప్పకుండా ప్రజలను పోషించాడు. ప్రజలకు ఏ హానీ రానీకుండా కంటికి రెప్పలా కాపాడుతుండేవాడు. విద్వాంసులను, పండితులను, కవులను, కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదములు పొందుచుండేవాడు.

ఒకనాడు విక్రమార్కుడు మంత్రియైన భట్టితో, విలు విద్యానిపుణులైన వేటగాండ్రతో వేటకు బయలుదేరాడు. ఉజ్జయినీ నగరానికి పరిసర అరణ్యంలో "క్రూరమృగ సంచారం" ఎక్కువ అగుటచే సమీప గ్రామవాసులు భయపడి-మహా రాజుకు విన్నవించుకొన్నారు. అందువలననే-వేటకు బయలుదేరాడు విక్ర మార్కుడు. క్రూరమృగములను చెండాడి, కోయవాండ్రకు ఆయా ప్రాంతాలలో నివసించే గిరిజనులకు సౌఖ్యము కలిగించాలని.

విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని, రధము నెక్కి బయలుదేరాడు. ఆయన వెనుక రధముపై భట్టి-ఆ తరువాత విలుకాండ్రు. వేటకాండ్రు, వేటకుక్కలు- చిక్కములు, వలలు మొదలగువానితో పరిజనులు, బయలు దేరారు. మృగములను చప్పుడుచేసి బయటకు రప్పించుటకు కావలసిన వాయిద్యము లతో కొంతమంది సేవకులు కూడ బయలు దేరారు.

విక్రమార్కుడు మిక్కిలి చాకచక్యముతో క్రూరమృగములను హత మార్చినాడు; ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగబాధ లేకుండా చేసినాడు. ఆయా గిరిజన ప్రజలు మిక్కిలి ఆనందించి, మహారాజు మెచ్చునట్లు తమ సంతోషం ప్రకటించుచు నృత్యగానములచే విక్రమార్కుని ఆనందపరచినారు. విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరినాడు.