యక్షప్రశ్నలు



అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరం ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి " అయ్యా! నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తు కుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారి పోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి " అని ధర్మరాజును అడిగాడు. ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగల లేదు.

అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయం అయింది. పాండవులు అలసి పోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి " అన్నయ్యా ! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి? " అని అడిగాడు.

ధర్మరాజు నవ్వి " నకులా! సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మన చేసుకున్న కర్మే. వేరే ఏమి కాదు " అన్నాడు. భీముడు నకులుని చూసి " తమ్ముడూ ! ఆ రోజు పాత్రిగామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకు వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి " అన్నాడు. నకులుడు " అన్నయ్యా భీమా ! అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే. అదే అసలు కారణం.

అన్నయ్యలూ ! ఆ రోజే మాయజూదం ఆడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా " అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు " తమ్ముడూ! ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు " అన్నాడు. నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. ధర్మరాజు " అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొంత నీరు తీసుకురా " అన్నాడు. నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్ళు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది.

" అన్నా! ఈ తటాకము నాది. నీవు ఈ తటాకములో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి " అన్న మాటలు వినిపించాయి. నకులుడు దానిని పట్టించు కోకుండా నీరు త్రాగారు. కొలను బయటకు వచ్చి స్పృహతప్పి పడి పోయాడు. నీళ్ళకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయే సరికి ధర్మరాజు సహదేవుని చూసి " సహదేవా! నీ అన్నయ్య నకులుడు నీళ్ళు తీసుకు రావటముకు వెళ్ళి ఎంతకూ రాలేదు. నీవు పోయి చూసి రా " అని చెప్పి పంపించాడు. సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్ళు త్రాగటానికి కొలనులో దిగపోయే సమయంలో " మహానుభావా! ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు " అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు.

నకులుని లాగానే స్పృహతప్పి పడి పోయాడు. పోయిన ఇద్దరూ ఎంతకీ రాక పోయే సరికి ధర్మరాజు అర్జునిని చూసి " అర్జునా! నీ తమ్ములు నీళ్ళకు వెళ్ళి ఎంతకూ రాలేదు. ఏం జరిగిందో చూసి రా " అని చెప్పి పంపించాడు. అర్జునుడు కొలను సమీపించగానే అశరీరవాణి " ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహతప్పి పడి పోతారు " అన్నాడు. అర్జునుడు " ఎవడురా నువ్వు? చాటుగా మాట్లాడు తున్నావు. ఉండు నిన్ను సంహరిస్తాను " అంటూ శబ్ధవేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినిపించాయి.

అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. అర్జునుడు కూడా స్పృహతప్పి పడి పోయాడు. వెళ్ళిన ముగ్గురూ రాక పోయే సరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి " భీమా వెళ్ళిన ముగ్గురూ తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా " అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరలా అదే అశరీరవాణి " ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నాప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్ళు త్రాగు " అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్ళు త్రాగి స్పృహతప్పి పడి పోయాడు.